ఇరుకు వీధుల్లో కార్యక్రమాలు పెట్టడం.. తెలుగుదేశానికి జన స్పందన విపరీతంగా ఉందని చూపించడం ఆ పార్టీ నేతలు చాలాకాలంగా చేస్తున్న పని. గతం నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఎన్నికల సమయంలోనూ పాత విధానాన్నే అవలంభిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాల ప్రాంగణాల్లో సభలు పెడుతుంటే.. చంద్రబాబు నాయుడు మాత్రం ఇరుకు వీధుల్లో కార్యక్రమాలు పెట్టి.. నేతలు, కార్యకర్తల్ని తరలించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
కొంతకాలం క్రితం చంద్రబాబు కందుకూరులో సభ పెట్టారు. పర్మిషన్ ఒకచోట తీసుకుని మరోచోట కార్యక్రమం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, సామాన్యులు కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇరుకైన వీధిలో ప్రోగ్రాం పెట్టారు. జనం స్వల్పంగా వచ్చినా భారీగా తరలివచ్చారని చూపించుకునేందుకు ప్రయత్నించడంతోనే ఇలా జరిగిందని తేలింది. కానీ బాబు తీరు మార్చుకోలేదు. మళ్లీ మళ్లీ అలాగే చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్రలో కూడా ఇదే తంతు జరిగింది. సన్నటి సందుల్లో సభలు పెట్టడం.. డ్రోన్లతో చిత్రీకరించి ఆహా.. ఓహో.. జనమంతా వచ్చేస్తున్నారని ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకోవడం సర్వసాధారణమైంది.
తాజాగా చంద్రబాబు, జగన్ ఎన్నికల ప్రచారాలను ప్రారంభించారు. వైఎస్సార్సీపీ అధినేత ప్రొద్దుటూరులో విశాల ప్రాంగణంలో జరిగిన సభలో ప్రసంగించారు. ఇక్కడికి తరలివచ్చిన ప్రజలకు ఏమీ కాకుండా చర్యలు తీసుకున్నారు. బాబు రాప్తాడులో ఇరుకైన వీధిలో రోడ్ షో చేశారు. దీనికి నాయకులు, కార్యకర్తల్ని బతిమిలాడి తీసుకురాగా జనం వెల్లువలా తరలివచ్చారని ఈనాడు మురిసిపోయింది. అనుకోని ప్రమాదం జరిగి ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు. నారా వారు కనీసం సానుభూతి చూపకుండా వైఎస్సార్సీపీ కుట్ర అని రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. పోలీసుల వల్లే ఇలా జరిగిందని బురద వేస్తారు. సభలు పెట్టాలంటే జగన్‌లా ధైర్యం ఉండాలి. నాయకులు, కార్యకర్తల అభిమానం మెండుగా సంపాదించి ఉండాలి. కానీ చంద్రబాబుపై తెలుగు తమ్ముళ్లకే ప్రేమ లేదు. అందుకే ఇరుకు వీధుల్లో కార్యక్రమాలు పెట్టి వారి జీవితాలతో ఆడుకుంటున్నాడు.