CM Jagan : వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది.
ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్‌కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం జగన్ న్యాయపోరాటా నికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడిచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కృష్ణాబోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్‌శక్తి శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది.
శ్రీశైలం, సాగర్‌లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా.. తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణాబోర్డు రాష్ట్రానికి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు తెలంగాణ సర్కార్ తరలించింది.
ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువ ద్వారా విడుదల చేయాలన్న రాష్ట్ర అధికారుల విజ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు.శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే,
తమ భూభాగంలో ఉందని ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన ఆధీనంలోకి తీసుకుందని, అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతో నవంబర్ 30న తెల్లవారుజామున సీఈ మురళీనాథ్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు, జలవనరులశాఖ అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడికాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు.
దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కృష్ణానదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచు విభేదాలు తలెత్తడానికి కారణమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూనే.. ఒక్కో అవుట్లెట్ వద్ద బోర్డు, ఏపీ, తెలంగాణ అధికారులు ఒక్కొక్కరిని నియమించి, నీటి విడుదలను పర్యవేక్షించాలని ఇద్దరు ఈఎన్సీలు చేసిన సూచనకు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే అంగీకరించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు సిబ్బందిని సమకూర్చాలని సభ్య కార్యదర్శి చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.