స్కిల్ స్కాం లో అరెస్ట్ అయిన చంద్రబాబుకి మద్దతుగా ఆంద్రప్రదేశ్ లో ఎక్కడా పెద్దగా నిరసనలు జరగలేదు కానీ, చంద్రబాబే హైద్రబాద్ లో ఐటీని అభివృద్ది చేశాడని చెప్పుకునే కొంతమంది టీడీపీ సానుభూతిపరులు మాత్రం ఆ పార్టీ ఆదేశాల మేరకు ఏపీ నుండి వెళ్ళి మరీ హైద్రబాద్ లో పెద్ద ఎత్తున నిరసనలకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సోషల్ మీడియా విపరీతమైన ప్రచారము కల్పించింది. చివరికి ఏపీ నుండి వెళ్ళిన కొంతమంది తెలుగుదేశం అభిమానులు, ఐ-టీడీపీ కార్యకర్తలు తప్ప ఆ నిరసనల్లో ఎవరు కనపడలేదు. హైద్రబాద్ లో ఉన్న సెటిలర్స్, ఐటీ ఉద్యోగులు కూడా పెద్దగా ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి చూపించలేదు. ఎప్పుడు ఐటీ ఉద్యోగస్తులతో రద్దిగా ఉండే హైద్రబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో అరాకొరాగా నిర్వహించిన కార్యక్రమాల్ని కూడా నిన్నమొన్నటివరకు ఉన్న బీఆరెస్ ప్రభుత్వం అడ్డుకుంది.
వీరు పిలుపిచ్చిన కార్యక్రమం విపరీతంగా సక్సెస్ అవుతుందని ఆశపడ్డ టీడీపీ నాయకుల్లో నిరాశే మిగిలింది. అయితే “అత్త మీద కోపం దుత్తమీద” చూపిన విధంగా తమ కార్యక్రమానికి ఐటీ ఉద్యోగస్తుల నుండి కానీ , సెటిలర్స్ నుండి కానీ ఎలాంటి స్పందనా లేకపోయే సరికి ఎక్కడ అబాసుపాలవుతామో అని తమకున్న మీడియా బలంతో, చంద్రబాబు మీద అభిమానంతో సెటిలర్స్ ఆశక్తి చూపినా బీఆరెస్ ప్రభుత్వమే వైసీపీతో చేతులు కలిపి ఈ నిరసనలని అడ్డుకుందని ప్రచారం మొదలుపెట్టారు. అక్కడితో ఆగకుండా తెలంగాణాలో రాబోయే ఎన్నికల్లో సెటిలర్స్ అందరు ఏపీ సీఎం జగన్ కు మద్దతుగా ఉన్న బీఆరెస్ ప్రభుత్వాన్ని గద్దిదించడమే లక్ష్యంగా ఓట్లు వేస్తారంటూ అటు అనుకూల చానల్స్ లోను, వారి అనుకూల సోషల్ మీడియా ఖాతాల నుండి విపరీతంగా ప్రచారం చేసుకున్నారు.
అయితే వారు అనుకున్న విధంగానే మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీ గెలవడమూ జరిగింది. ఈ నేపధ్యంలో టీడీపీ అభిమానులు, ఐ-టీడీపీ కార్యకర్తలు కేవలం తెలంగాణ ఎన్నికలు బాబు అరెస్టు చుట్టే జరిగినట్టుగా తమ మార్క్ ప్రచారంతో హోరెత్తించారు. తమ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్న బీఆరెస్ ప్రభుత్వాన్ని ఎలాగైతే ఓడించారో అలాగే 2024లో చంద్రబాబుని అరెస్టు చేసిన జగన్ ప్రభుత్వాన్ని కూడా ఓడించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని ప్రచారం మొదలుపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్ పార్టీ ఓటమి చెందినప్పటికీ కొంచెం పరిశీలించి చూస్తే ఈ ఫలితాలు ఎప్పుడు అర్ధసత్యాలు అసత్యాలతోనే కాలం గడిపే టీడీపీకే డేంజర్ బెల్స్ మోగించాయని చెప్పాలి. ఎందుకంటే మొదటగా టీడీపీ వారు ఆశ పెట్టుకునట్టు వీరు ఎంత ప్రచారం చేసినా, సెటిలర్స్ ఓట్లు బీఆరెస్ పార్టికే పడ్డాయి. దీనికి సాక్ష్యం సెటిలర్స్ , సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అధికంగా ఉంటే కూకట్పల్లిలో టీడీపీ పిలుపుని పట్టించుకోకుండా బీఆరెస్ కే ఓట్లు వేసి అత్యదిక మెజారిటీతో గెలిపించారు. అలాగే శేర్లింగంపల్లి, పటాన్ చెరువు, కుత్భూల్లాపూర్, ఎల్బీ నగర్, సికింద్రబాద్ కంటోన్మెంట్, అంబర్ పేట, జూబ్లిహిల్స్, ఖైరతాబాద్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ముషీరాబాద్, రాజేంద్రనగర్, సనత్ నగర్, ఉప్పల్ ఇలా సెటిలర్స్ ఉండే అన్ని నియోజక వర్గాలు టీడీపీ పిలుపుని పట్టించుకోకుండా బీఆరెస్ పార్టీకే పట్టం కట్టడం వాళ్ళు ఆందోళన చెందాల్సిన విషయం. ఈ ఫలితాలని బట్టి సెటిలర్స్ చంద్రబాబు అరెస్ట్ ని కానీ, టీడీపీ పిలుపుని కానీ పట్టించుకోలదని చెప్పొచ్చు.
ఇక మరో కోణంలో టీడీపీకి డేంజర్ బెల్స్ మోగించే అంశం చూస్తే సెటిలర్స్ ఉండని తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు గంపగుత్తగా బీఆరెస్ ప్రభుత్వాన్ని గద్దెదంపడంలో కాంగ్రెస్ కి పట్టం కట్టడంలో కీలక పాత్ర పోషించాయి .
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమనేతగా కేసీఆర్ కి పట్టం కట్టిన ఈ గ్రామీణ ప్రాంత ప్రజలే 9ఏళ్ళ తరువాత నిర్ధాక్ష్యన్యంగా ఆయనని గద్దె దించాయి, ఇలా గ్రామీణ తెలంగాణ ప్రజల తిరుగుబాటుకి కారణం! రెండో దఫా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వ పాలనలో పారదర్శకత లోపించడమే. తెలంగాణ అభివృద్ది అంటే హైద్రబాద్ మాత్రమే చూపిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలని విస్మరించడమే కాక ఏ సంక్షేమ పధకమైనా తమ కార్యకర్తలకే , తాము చెప్పిన వారికే అంటూ సాగిన పాలన పట్ల గ్రామీణ ప్రాంతంలో నిజమైన లబ్దిదారులు ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకతను పెంచుకున్నారు.
మరో పక్క తన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు ప్రతి సంక్షేమ పధకం నిజమైన లబ్దిదారులకే చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి అందిస్తుంటే, మిగులు రాష్ట్రంగా చెప్పుకునే తమ రాష్ట్రంలో మాత్రం ఇలా వివక్షకు గురవ్వడం వారిని తీవ్రంగా కదిలించింది. దీని ఫలితమే తెలంగాణ గ్రామీణ ప్రాంతం బీఆరెస్ కు దూరమైందని విశ్లేషకుల మాట, అలాగే ఉద్యోగస్తులకు తెలంగాణ కన్నా ఏపీలోనే జీతాలు అధికంగా ఉండటం, విద్యార్ధులకి పరీక్షలు నిర్వహించడంలో లోపాలు, మరో పక్క ఏపీలో పరీక్షలు నిర్వహించి విజయవంతంగా ఉద్యోగాలు ఇవ్వడం. అభివృద్ది అంటే బీఆరెస్ పార్టీ ఉత్తర తెలంగాణగా చూడటం, ఏపీలో ప్రతి ప్రాంతానికి జగన్ గారు మెడికల్ కాలేజీలు, సచివాలయాలు, పరిశ్రమలు అంటూ అభివృద్దిని విస్తరించడం ఇవన్ని బీఆరెస్ పాలనపై వ్యతిరేకత పెంచుకోవడంలో తెలంగాణ ప్రజలకు దోహదపడిన అంశాలు.
ఒక పక్క సెటిలర్స్ ఎక్కడా కూడా టీడీపీ పిలుపుకి స్పందించకపోవడం, మరో పక్క తెలంగాణ ప్రజలు జగన్ గారి పాలనను బేరీజు వేసుకుని బీఆరెస్ పార్టీని గద్దె దించడం చూస్తే రాబోయే కాలంలో ఈ పల్స్ టీడీపీకి ప్రమాదమనే చెప్పాలి. మరి తెలుగుదేశం ఇప్పటికైనా వాస్తవంలోకి వచ్చి తమ పంధాని మార్చుకుంటుందో లేక ఇలాగే అసత్యాలు అర్ధసత్యాలని ప్రచారం చేసుకుంటూ వాటి ఆధారంగానే ఎన్నికల్లో పై చేయి సాధించవచ్చు అనే భ్రమల్లో ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.