ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ వైసీపీ పార్టీ అభ్యర్ధికి మద్దతు ప్రకటించిన విషయం అందరికి తెలిసిన విషయమే .. ఇటు రాజకీయాల్లోనే కాకుండా అటూ సినీ వర్గాల్లో సైతం హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహారం అల్లు కొణిదెల కుటుంబాల మధ్య మరింత దూరం పెంచిందనే వాదన వినిపిస్తుంది. రాజకీయాలు ఎలా ఉన్నా సినిమా పరంగా కూడా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలితో అల్లు కుటుంబం తరచుగా ఇబ్బంది పడుతూ వచ్చారనే వాదన ఉంది. 2019 ఎన్నికల ముందు అల్లు అరవింద్ పై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అప్పటిలో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రజారాజ్యం సమయంలో తనని ప్రచారానికి పంపకుండా అల్లు అరవింద్ అడ్డుకున్నారని, తనని కాకుండా రామ్ చరణ్ , అల్లు అర్జున్ ని పంపాలని సలహా కూడా ఇచ్చారని అంటూ వేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో కుటుంబంలో ఏదో జరుగుతుందనే విషయం బయటికి వచ్చింది.
అల్లు అర్జున్ సైతం ఒక సినీ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ పేరును చెప్పమని, పవన్ అభిమానులు కోరగా తాను స్పందిస్తూ చెప్పను బ్రదర్ అనడం కూడా అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. అప్పుడప్పుడు ఇలా వీధిన పడుతున్న చిరంజీవి కుటుంబ వ్యవహారం మరోసారి నాగబాబు ట్వీట్ తో బయటపడినట్టైంది. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ సైతం వచ్చి ప్రచారం చేస్తారనే వాదన మొదటి నుండి వినిపిస్తున్నా ఆయన పిఠాపురం రాకుండా పవన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైసీపీ అభ్యర్ధికి నేరుగా వెళ్ళి మద్దతు ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. అయితే ఈ నేపథ్యంలో చిరంజీవి సోదరుడు నాగబాబు “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!” అంటూ వేసిన ట్వీట్ బన్నీని ఉద్దేశించే అని వాదన వినిపిస్తుంది. నాగబాబు వ్యవహార శైలితో మరో సారి విభేదాలు బహిర్గతమయ్యాయనే మాట అటూ సినీ ఇటూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది
మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!