మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎల్లో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పార్టీ మారుతారంటూ కొంత కాలంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అలా ఏమీ లేదని చాలాసార్లు బాలినేని కొట్టి పారేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పలుమార్లు చర్చించారు. ఈ క్రమంలో రూ.202.03 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే.
నివాస స్థలాలకు అవసరమైన భూమి కోసం వెంగముక్కపాళెం, యరజర్ల గ్రామాల్లో సుమారు 175 ఎకరాలకు చెందిన యజమానులు 90 మంది రైతులతో ప్రభుత్వం ఒప్పదం కుదుర్చుకుంది. నగదును రైతుల ఖాతాల్లోనికి జమ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా ఇళ్ల స్థలాల్లో అవినీతి జరిగిందని ఎల్లో మీడియా అబద్ధాలను ప్రచారం చేస్తోంది. దీంతో ఈనాడు, ఆంధ్రజ్యోతిపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. హద్దు దాటితే లక్ష మందితో మీ ఆఫీసులు ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. పేదలకు మంచి చేసేందుకు చేపట్టిన కార్యక్రమం విషయంలో నీచంగా వ్యవహరిస్తే సహించనని హెచ్చరించారు.