ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అంతేకాకుండా టెట్ పరీక్షకు సంబంధించిన వివరాలను కూడా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. దీంతో ఉపాధ్యాయ పరీక్షల కోసం ఎదురుచూపులకు తెరపడింది.
ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఫిబ్రవరి 8 నుంచి టెట్ పరీక్ష నిర్వహిస్తామని ఫిబ్రవరి 12 తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలై ఏప్రిల్ 7 తేదీన ఫలితాల వెల్లడితో ముగియనుందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కాగా 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,280 ఎస్జీటీ పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా అభ్యర్థులు కేటగిరీల వారీగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.