2009 వరకూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే పేరు రాష్ట్ర ప్రజలకు అంతగా పరిచయం లేని పేరు. ఇప్పుడంటే రాష్ట్ర రాజకీయాలన్నీ ఆ పేరు చుట్టూ తిరుగుతున్నాయి కానీ 2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడి పేరుని పరిచయం చేసేంత వరకూ ఆ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపుతిప్పే పేరుగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా తొలిసారి గెలిచి దాదాపు పదేళ్ల తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరకూ వైఎస్ జగన్ అనే వ్యక్తి చేసే రాజకీయ ప్రయాణం ఎవరికైనా స్ఫూర్తి దాయకమే. ఒక అనామకుడు బలవంతునిపై యుద్ధం చేసి గెలిచే కథలన్నీ సినిమాలలో చూస్తూ ఉంటాం. కానీ 125ఏళ్ల చరిత్ర కలిగి దేశాన్నే శాసించే స్థితిలో ఉన్న ఒక బలమైన రాజకీయ పార్టీని ఒకే ఒక్కడైన వైఎస్ జగన్ కూకటివేళ్ళతో సహా పెకిలించివేసాడు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉనికి కనుమరుగు కావడానికి ఒకే ఒక్క కారణం జగన్ అని రాజకీయ జ్ఞానం ఉన్న ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిన మాట. నిజానికి జగన్ జీవితంలో ఎన్నో నాటకీయ మలుపులున్నాయి. ఆ మలుపులే ఆయన రాజకీయ ప్రయాణాన్ని యాత్ర 2గా తీయడానికి ముడిసరుకైంది. మరి జగన్ రాజకీయ ప్రయాణం ఆధారంగా ‘మహి వి రాఘవ్’ తెరకెక్కించిన యాత్ర మెప్పించిందో లేదో మన సమీక్షలో తెలుసుకుందాం.
ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడైన జగన్ ని ప్రజలకు పరిచయం చేస్తూ ఎంపీగా నిలబెట్టే సన్నివేశంతో యాత్ర 2 మొదలవుతుంది. కానీ హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనూహ్య మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతాయి. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగన్ ని ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేయడం, వైఎస్సార్ మరణంతో తట్టుకోలేక మరణించిన రాష్ట్ర ప్రజలను ఓదార్చడానికి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం, ఈ ఓదార్పు యాత్రను ప్రోగ్రెస్ పార్టీ హైకమాండ్ అడ్డుకోవడం, దాంతో ఆ పార్టీ నుండి బయటకు వచ్చిన జగన్ సొంత పార్టీ పెట్టుకుని ఉప ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలవడంతో ప్రోగ్రెస్ పార్టీ వ్యవస్థల సహకారంతో జగన్ పై కేసులు బనాయించి జైలులో పెట్టడంతో జగన్ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. ఈ పరిస్థితులను జగన్ ఎలా ఎదుర్కున్నాడు? చివరకు ముఖ్యమంత్రి అయ్యాడా లేదా అన్నది మిగిలిన కథ.
ఎలా ఉందంటే.. ?
జీవితకథల ఆధారంగా సినిమాలు రూపొందడం కొత్తేమి కాదు. కానీ తగినంత డ్రామా ఉంటే తప్ప బయోపిక్ లను ప్రేక్షకులు ఆదరించడం లేదన్నది అంగీకరించాల్సిన సత్యం. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. మరోవైపు సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి, వైఎస్సార్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర చిత్రాలు ఘనవిజయం సాధించాయి. అతిశయోక్తులు లేకుండా ఆయా వ్యక్తుల జీవితకథను దర్శకులు నాగ్ అశ్విన్, మహి వి రాఘవ్ తెరకెక్కించడమే ఆయా చిత్రాల ఘన విజయానికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో జగన్ పదేళ్ల రాజకీయ జీవితం ఆధారంగా రూపొందిన యాత్ర 2 ప్రజలను ఆకట్టుకోవడంలో సఫలమైందనే చెప్పొచ్చు.
ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి , జగన్ పాత్రలో తమిళనటుడు జీవా పరకాయ ప్రవేశం చేశారు. చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్ తన పాత్ర పరిధి మేరా నటించగా, అంధుడిగా జార్జ్ మర్యన్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ప్రోగ్రెస్ పార్టీ అధినేతగా నటించిన జర్మన్ నటి సుజానే బెర్నెట్ తన నటనతో చెలరేగిపోయారనే చెప్పొచ్చు. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం ఆకట్టుకోగా ‘మరుగైపోయావా రాజన్న’ అనే పాట కన్నీళ్లు పెట్టిస్తుంది. మధీ ఛాయాగ్రహణం, మహి వి రాఘవ్ దర్శకత్వం అద్భుతంగా ఉన్నాయి. టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కడపోళ్ల మొండితనం గురించి శుభలేఖ సుధాకర్ మాట్లాడిన ప్రతీ మాటకు థియేటర్లో మంచి స్పందన దక్కడం గమనార్హం.
చివరిగా..
దేశాన్నే పాలిస్తున్న అతిపెద్ద పార్టీని ఒంటరిగా ఎదిరించి, పార్టీ పెట్టి, ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులును ఎదుర్కొని అనుకున్నది సాధించిన నాయకుడిగా నిలిచిన వైఎస్ జగన్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన రాజకీయ ప్రయాణాన్ని యాత్ర 2గా మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం దర్శకుడు మహి వి రాఘవ్ చేయడం అభినందనీయం. జగన్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో యాత్ర 2 చూస్తే అర్ధం అవుతుంది. కానీ అక్కడక్కడా స్లోగా సాగే కథనం ఈ చిత్రానికి కాస్త బలహీనతగా చెప్పొచ్చు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు మాత్రం విపరీతంగా నచ్చే ఈ మూవీ న్యూట్రల్ ఆడియన్స్ ను కూడా అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వారం థియేటర్లో ఫ్యామిలీతో కలిసి చూడడానికి యాత్ర 2 మంచి ఛాయస్ ..