సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మేనిఫెస్టో ద్వారా మరోసారి మహిళలకు పెద్దపీట వేశారు. 2019లో ఆయన వారి కోసం అనేక పథకాలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేశారు. అందులో ఒకటి అమ్మఒడి పథకం. పేద తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు ఇబ్బందులు పడకూడదని సంవత్సరానికి రూ.15 వేల చొప్పున అందించారు. నడి వయసు మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు చేయూత పథకం కింద వడ్డీలేని రుణాలు ఇచ్చారు. ఆసరా, తోడు తదితర స్కీంలను అందించారు.
2014లో కూటమిగా వచ్చిన బాబు రూ.14,205 కోట్ల పొదుపు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఒక్క రూపాయి కూడా చేయలేదు. ఎన్నికలకు ముందు పసుపు – కుంకుమంటూ హడావుడి చేశాడు కానీ దాని వల్ల మహిళలకు లబ్ధి జరగలేదు. అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇచ్చి పక్కా ఇల్లు కట్టిస్తామన్నారు. కానీ ఒక్క సెంటు కూడా ఇవ్వలేదు. జగన్ 2019 – 24 మధ్య తన పాలనలో మహిళలకు డీబీటీ కింద రూ.1,89,519 కోట్లు, నాన్ డీబీటీ కింద 94,347 కోట్లు లబ్ధి చేకూర్చారు. జగన్ 30 లక్షల మందికి పైగా మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అంతేకాకుండా వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి ఆస్తిగా సమకూర్చాడు.
ఇదిలా ఉండగా 2024 మేనిఫెస్టోలో మహిళలకు అందిస్తున్న పథకాన్ని కొనసాగించి స్వల్ప మార్పులు చేశారు. అమ్మ ఒడిని రూ.17 వేలకు పెంచారు. గత ఐదేళ్లలో 44.48 లక్షల మంది కోసం రూ.26 వేల కోట్లను ఖర్చు చేశారు. చేయూత కింద గతంలో రూ.75 వేలు ఇచ్చారు. 33.15 లక్షల మందికి రూ.19,189 కోట్ల లబ్ధి చేశారు. ఈసారి కూడా అదే విధంగా నాలుగు విడతలో నగదు అందిస్తారు. కాపునేస్తం కింద ఒక్కొక్కరికి నాలుగు విడతల్లో రూ.60 వేల లెక్కన ఇచ్చారు. మొత్తంగా 4.63 లక్షల మందికి రూ.2,030 కోట్ల మేర అందించారు. వచ్చే ఐదేళ్లు ఈ పథకాన్ని కొనసాగిస్తారు. ఈబీసీ నేస్తం కింద ఇప్పటి వరకు 4.95 లక్షల మందికి రూ.1,877 కోట్లు అందించారు. వచ్చే ఐదేళ్లలోనూ నాలుగు విడతల్లో రూ.60 వేలు అందిస్తారు. వైఎస్సార్ ఆసరా కింద రూ.25,571 కోట్లు, సున్నా వడ్డీ కింద రూ.4,969 కోట్లను అందించారు. వచ్చే ఐదేళ్లలో రూ.3 లక్షల వరకు రుణాన్ని సున్నా వడ్డీ కింద ఇవ్వనున్నారు.