వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ అధిష్టానం పలువురు పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంటరీ నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలను అప్పగించింది. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంతోపాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గాలకు రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గాలకు పి.రామసుబ్బారెడ్డి, కడప, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాలకు కె.సురేష్‌బాబును నియమించారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈయన రీజినల్ కో-ఆర్డినేటర్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. అలాగే పార్టీ విజయవాడ సిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మల్లాది విష్ణును నియమించారు.