డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ.. ఈ పథకం పేదలకు చేస్తున్న మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రధానంగా ఎంతో ఖరీదైన గుండె వైద్యం విషయంలో భరోసా కల్పించింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం ఆయన మరణానంతరం అటకెక్కింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో బాధితులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. రాజన్న తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం వచ్చింది. కొత్త వ్యాధులను చేర్చి పటిష్టంగా అమలు చేస్తున్నారు. గుండె జబ్బుతో ఉన్నవారిని సీఎం జగన్ దేవుడిలా ఆదుకున్నారు. రూ.లక్షలు విలువ చేసే ఆపరేషన్లను కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా చేయించి ఆర్థికంగా భరోసా కూడా ఇచ్చారు.
రూ.25 లక్షల వరకు..
మొన్నటి వరకు ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల వరకు ఉండేది. జగన్ దీనిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచి కొత్త కార్డులు అందజేశారు. దీంతో ఖరీదైన వైద్యం చేయించుకునేందుకు పేదలకు మరింత అవకాశం కలిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 1,058 ప్రొసీజర్లు ఉండగా, వాటిని జగనన్న ప్రభుత్వం 9,257కు పెంచింది. 2019 నుంచి చూస్తే ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం ఏకంగా రూ.13 వేల కోట్లకు పైగానే ఈ ప్రభుత్వం ఖర్చు చేసిందంటే పేదల ఆరోగ్యం విషయంలో ఎంత చిత్తశుద్ధిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా 40 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందుకున్నారు.
3.67 లక్షల మందికి పునర్జన్మ
రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటి వరకు 3,67,305 మంది గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. వీరికి 4,87,303 ప్రొసీజర్లలో చికిత్సలు అందించడానికి ప్రభుత్వం ఏకంగా రూ.2,229.21 కోట్లు ఖర్చు చేసింది. వారిలో 2,22,571 మంది యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, హార్ట్ స్ట్రోక్, స్టెంట్లు వంటి కార్డియాలజీ సంబంధిత 2.82 లక్షల ప్రొసీజర్లలో చికిత్సలు చేయించుకున్నారు. మిగిలిన 1,44,734 మంది బైపాస్ సర్జరీలు, వాల్వ్ రిపేర్, కార్డియాక్, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో 2.05 లక్షల ప్రొసీజర్లలో ఉచిత వైద్యం పొందారు. మరో వైపు చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. పేదల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర చోట్ల నెట్వర్క్ ఆస్పత్రుల వ్యవస్థను బలోపేతం చేశారు. దీంతో కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచితంగా వైద్యం చేయించుకునే వెసులుబాటు కలిగింది. చంద్రబాబు సర్కారు ఈ పథకాన్ని నిర్వీర్యం చేయగా జగన్ ప్రత్యేకశ్రద్ధ పెట్టి పేదల ఆరోగ్యానికి నేనున్నానంటూ అండగా నిలిచారు.