ఏపీలో మీడియా చానెళ్లు రెండు వర్గాలుగా విడిపోయాయి. ఓ వర్గం చానెళ్లు ఎల్లో మీడియాగా ముద్ర వేయించుకుని టీడీపీకి అనుకూల వార్తా కథనాలు ప్రచారం చేస్తున్నాయన్న అప్రతిష్ట మూటకట్టుకోగా ఆ చానెళ్లపై సీఎం జగన్ పలు సందర్భాల్లో ఘాటుగా విమర్శించిన సంగతి తెలిసిందే. మరోవైపు టీడీపీ మాత్రం కొన్ని చానెళ్లను బ్లూ మీడియాగా పేర్కొంటూ విమర్శలు చేస్తూ వస్తుంది. ఇలా తెలుగు మీడియా ఛానెల్స్ రెండు వర్గాలుగా విడిపోగా న్యూట్రల్ ఛానెల్స్ గా ముద్ర పడ్డ టీవీ9, ఎన్టీవీని సైతం టీడీపీ బ్లూ మీడియాగా పేర్కొంటూ విమర్శలు గుప్పిస్తూ వస్తుంది.
కాగా ఇప్పుడు ఏవైతే టీడీపీ అనుకూల మీడియాగా, ఎల్లో మీడియాగా పేరు తెచ్చుకున్నాయో ఆ మీడియా ఛానెళ్ల టీఆర్పీ ఘోరంగా పడిపోతుండగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల మీడియాగా టీడీపీ విమర్శిస్తున్న ఛానెళ్ల రేటింగ్స్ అమాంతం పెరిగి ఎవరికీ అందనంత ఎత్తులో ఉండటం ఇప్పుడు గమనించాల్సిన విషయం. ప్రభుత్వంపై అసత్య వార్తలు ప్రచారం చేస్తూ ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వార్తా కథనాలు ప్రచారం చేస్తున్న సదరు టీవీ చానెళ్లను ప్రజలు పట్టించుకోవడం మానేశారన్నది ఆయా టీవీ ఛానెళ్ల రేటింగ్స్ చూస్తే అర్ధం అవుతుంది.
ముఖ్యంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన అనంతరం అధికార పార్టీ ఛానెల్స్ గా టీడీపీ విమర్శిస్తూ వచ్చిన టీవీ ఛానెళ్ల రేటింగ్స్ పెరగగా టీడీపీ అనుకూల చానెళ్లుగా ముద్రపడ్డ ఎల్లో మీడియా ఛానెళ్ల రేటింగ్స్ దిగజారిపోవడం గమనార్హం. గతంలో రేటింగ్స్ పరంగా వెనుకబడిన సాక్షి టీవీ ఏడు లేదా ఎనిమిదో స్థానంలో ఉండేది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనంతరం మిగిలిన చానెళ్లను దాటుకుంటూ ఏకంగా మూడో స్థానానికి ఎగబాకడం విశేషం. అంతేకాకుండా రేటింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న టీవీ9, ఎన్టీవీ, సాక్షి ఛానెళ్ల వ్యూయర్ షిప్ మొత్తం కలిపినా రాష్ట్రంలో ఉన్న అన్ని సాటిలైట్ ఛానెళ్ల వ్యూయర్ షిప్ కంటే రెట్టింపు స్థాయిలో ఉండడం గమనార్హం. దీన్నిబట్టి అధికార పార్టీ చానెళ్లుగా ముద్రపడిన చానెళ్లకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే టీడీపీకి అనుకూల మీడియాగా ముద్రపడిన చానెళ్లను ప్రజలు పక్కనబెడుతుండడం ఆయా చానెళ్లకు షాక్ కలిగించే విషయంగానే పరిగణించాలి.