పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు విషయంపై ఏపీ ఎన్నికల చీఫ్ ఇచ్చిన ప్రత్యేక మార్గదర్శకాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంత్రం వ్యక్తం చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఒక్క ఏపీ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారని ఆ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఏపీలో ఎలా ఇస్తారని, ఒక పార్టీ కోరగానే ఇలాంటి మార్గదర్శకాలను ఎలా ఇస్తారని, ఎక్కడా లేని సర్క్యులర్ ఏపీలో ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన నిలదీశారు.
బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకమున్నా సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రిటర్నింగ్ అధికారి సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని, పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పైనా గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సీల్ లేదని వాటిని ఇన్ వాలిడ్ గా పరిగణించకూడదని ఆయన స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారులను మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మద్దాల గిరి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, గ్రివెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి కలిసి ఫిర్యాదు చేశారు. దేశంలోనే అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ నమోదైన రాష్ట్రంగా ఏపీ రికార్డ్ సాధించిన విషయం తెలిసిందే.