మంత్రి దాడిశెట్టి రాజాతో యనమల కృష్ణుడు ఎస్ గన్నవరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో వైఎస్సార్సీపీఅభ్యర్థి దాడిశెట్టి రాజా గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఆ పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు నల్లదుస్తులే ధరిస్తానని ఆయన శపథం చేశారు. తాను మాటిస్తే తప్పననే విషయం తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని ఈ సందర్భంగా తెలిపారు. తెలుగుదేశం పార్టీలో 40ఏళ్లు కష్టపడి పనిచేసినా సరైన గౌరవం దక్కలేదని తెలిపారు.గతంలో యనమల రామకృష్ణుడి విజయం కోసం ఎంతో పాటుపడ్డానని కృష్ణుడు చెప్పారు. తునిలో టీడీపీని ముందుండి నడిపించినా తనకు రామకృష్ణుడు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. 40 సంవత్సరాలు యనమల రామకృష్ణుడు కోసం కష్టపడితే తనకి తీరని ద్రోహం చేశాడని తెలిపాడు. యనమల రామకృష్ణుడు ఎప్పుడూ హైదరాబాదులోనే ఉన్నా నియోజకవర్గ ప్రజల కోసం తాను ఎప్పుడు తునిలోనే ఉన్నానని చెప్పారు. చివరికి తనను కాదని రామకృష్ణుడు తన కుమార్తె దివ్యకు తుని టికెట్ ఇప్పించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణుడు మాట్లాడుతూ తన పై నమ్మకంతో పార్టీలో చేర్చుకున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా విజయం కోసం 24 గంటలూ పని చేస్తానని అన్నారు. తాను మాట ఇస్తే కట్టుబడి ఉంటానని, కష్టనష్టాలకు ఓర్చి రాజా విజయం కోసం పని చేస్తానని చెప్పారు. యువకుడైన దాడిశెట్టి రాజా నియోజకవర్గ అభివృద్ధి కోసం బాగా కృషిచేశారని, తన వర్గమంతా రాజా విజయం కోసం పని చేస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో దేవస్థానం మాజీ చైర్మన్ లాలం బాబీ, ఏఎంసీ చైర్మన్ మాకినీడి బాబు, మాజీ చైర్మన్ కొయ్యా మురళి, పోతల రమణ పాల్గొన్నారు.