సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తునిలో టిడిపి పార్టీకి భారీ షాక్ తగిలిందనే చెప్పవచ్చు. యనమల కృష్ణుడు టిడిపి తరఫున తుని సీట్ ఆశించి భంగపడ్డాడు.
టిడిపి పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలో తన అన్న యనమల రామకృష్ణుడికి నమ్మకంగా ఉంటూ వచ్చిన యనమల కృష్ణుడు టిడిపికి దూరం కానున్నారు. తునిలో రామకృష్ణుడు ఆరుసార్లు గెలవడానికి కృష్ణుడే కీలక పాత్ర పోషించాడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు కూతురు దివ్యకి తుని సీట్ కేటాయించడంతో గత మూడు నెలలుగా యనమల కృష్ణుడు టిడిపి మీద అలిగి ఉన్నాడు. యనమల దివ్య కు సీటు కేటాయించడం కోసం తన తమ్ముడిని రామకృష్ణుడు దూరం చేసుకున్నాడు. టిడిపి అధినాయకత్వం కూడా యనమల కృష్ణుడికి ఎటువంటి భరోసా కల్పించ లేదు. యనమల రామకృష్ణుడు కానీ టిడిపి అధిష్టానం కానీ ఎటువంటి సమాచారం అందించకపోవడంతో కృష్ణుడు ఇన్నాళ్ళ సేవకు ఇదేనా విలువ అంటూ సన్నిహితుల దగ్గర కలత చెందాడని సమాచారం .
గతంలో 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ యనమల కృష్ణుడు ఓడిపోవడంతో ఈసారి ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని ప్రణాళికలు రచించుకున్నాడు, అయితే టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకి దూరం అయిపోయాడు. చాలా రోజులు వేచి చూసినప్పటికీ ఎక్కడి నుంచి భరోసా రాకపోవడంతో తీవ్ర మనస్థానపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేశారు. రేపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లిలో వైసీపీ పార్టీలో చేరునున్నట్లు ఇప్పటికే తన అనుచరులకు సమాచారం అందించారు. కీలక ఎన్నికల సమయంలో ఇలా సీనియర్ నాయకులు పార్టీ వీడిపోవడం టిడిపికి కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు.