రఘురామకృష్ణరాజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారాడు. నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అలిగాడు. తనకు మరోచోట అవకాశం ఇవ్వాలని, లేకపోతే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కావాలని తప్పుడు ప్రచారం చేయించారని, డబ్బుతో ఎల్లో మీడియా ద్వారా ఏ విధంగా దుష్ప్రచారం చేయించారో ప్రజలకు చెప్పేస్తానని బెదిరించినంత పని చేయడంతో బాబు తలొగ్గారు. రఘురామను టీడీపీలో చేర్చుకున్నారు. ఉండి నియోజకవర్గ అసెంబ్లీ సీటు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడే పార్టీలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి.
ఉండి సీటును మొదటి జాబితాలోనే సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు ఇచ్చారు. అయితే ఇప్పుడు రఘురామ తెరపైకి రావడంతో అక్కడి తెలుగు తమ్ముళ్లలో అసహనం పెరిగిపోయింది. శనివారం నాటి చంద్రబాబు పర్యటనలో తమ అసంతృప్తిని ప్రదర్శించారు. గత ఎన్నికల్లో సైకిల్ గుర్తును తగులబెట్టిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీసిన విషయం తెలిసిందే. అయినా చంద్రబాబు రఘురామ వైపే మొగ్గు చూపారు.
తాజాగా నియోజకవర్గంలో రామరాజు మోటార్‌బైక్ ర్యాలీతో బల ప్రదర్శన చేశారు. ఐదుగురు పోటీ పడినా నాకు అవకాశం ఇచ్చి, ఇప్పుడు కుదరదంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు శివరామరాజు అనే నేత రెబల్‌గా పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. వీరి మధ్యలోకి రఘురామ రావడంతో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. మరోవైపు ఈ నరసాపురం ఎంపీ ఉండి టికెట్ కోసం ఒత్తిడి పెంచారు. కేసుల విషయంలో ఢిల్లీలో సాయం చేశానని, జగన్‌ను తిట్టానని తనకే అవకాశం ఇవ్వాలని చంద్రబాబును గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ పెద్దలు, పవన్ చేత చెప్పిస్తున్నారు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని, సీటు వదులుకోవాలని రామరాజుపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆయన తానే బరిలో ఉంటానని తెగేసి చెబుతున్నారు. కష్టకాలంలో పార్టీ భారం మోశానని, ఇప్పుడు ఎవరో బయటి వ్యక్తికి టికెట్ ఇస్తే సహించనన్నారు.
మొత్తంగా జగన్‌పై బురద వేసేందుకు రఘురామతో చంద్రబాబు స్నేహం చేస్తే ఇప్పుడు అతను బెదిరించే స్థాయికి చేరుకున్నాడు. దీంతో తోక కత్తిరించాలని బాబే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రామరాజు అనే రెచ్చగొట్టారని ప్రచారం జరుగుతోంది. ఉండిలో రాఘురామ ఉండలేకుండా చేయాలని నాటకాలు ఆడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.