ఇందుగలడందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుండు
ఎందెందు వెదకి చూచిన
అందందే గలడు దానవాగ్రణి వింటే.
అని బమ్మెర పోతానామాత్యులు చెప్పినట్టు
ప్రజాక్షేత్రంలో పాతుకుపోయి గడప గడపలో నవ్వుతూ కనపడుతున్న జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొని విపక్షాలు నిలబడగలుగుతాయా ?.
2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక ఏర్పడ్డ వైఎస్సార్సిపి ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టడానికి టీడీపీ ఎక్కువ సమయం తీసుకోలేదు . అయితే ఆ విమర్శలకు హేతుబద్దత, విమర్శలలో వాస్తవం లేకపోగా ఓడిపోయిన బాధ, అసహనం, ఓడించిన జగన్ పట్ల ఉక్రోషం, ద్వేషం మాత్రమే ప్రజలకు కనపడటం నిష్టుర సత్యం.
గడచిన నాలుగున్నరేళ్లలో అనుదినం, అనుక్షణం నిజానిజాలతో నిమిత్తం లేకుండా జగన్ పై వైఎస్సార్సిపి ప్రభుత్వం పై విమర్శల జడివాన కురిపించినా టీడీపీకి పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. పైగా ఎదుర్కొన్న ప్రతి ఉప, స్థానిక ఎన్నికల్లోనూ దారుణ పరాజయం పొందటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ చంద్రబాబు చివరికి చిరకాల రాజకీయ శత్రువు దివంగత మహానేత వైఎస్సార్, జగన్ ల బాటలో పాదయాత్రని మరోసారి నమ్ముకొన్నారు.
అయితే 2014 ఎన్నికల ముందు తన యాత్రలో ప్రజలకిచ్చిన హామీలు కానీ, టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు కానీ ఒక్కటి కూడా నెరవేర్చకుండా చేసిన మోసాల ఫలితంగా మళ్ళీ తాను ప్రజాక్షేత్రంలోకి వెళ్లినా జనాలు నమ్మరన్న ఉద్దేశ్యంతో కానీ, వయోభారాన్ని కానీ దృష్టిలో పెట్టుకొని కానీ టీడీపీకి భావి నాయకుడిగా లోకేష్ స్థానం సుస్థిరం చేసే ఉద్దేశ్యంతో కానీ లోకేష్ చేత పాదయాత్రకి శ్రీకారం చుట్టించాడు .
ఇప్పుడూ అప్పుడూ అంటూ రెండేళ్ల పాటు వార్తల్లో నానిన పాదయాత్ర ఎట్టకేలకు ఎన్నికలకు యాడాది ముందు మొదలయ్యింది కానీ దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు లాగా ఆగుతూ సాగుతుంది. అది కూడా ముందుగా ప్రకటించినట్లు 400 రోజులు నడవకుండా ఈ నెల 17 తో 220 రోజుల నడకతో అర్ధాంతరంగా ఆపేస్తున్నారు అని సమాచారం .
మరో వైపు ఇదేం ఖర్మ మనకి, బాదుడే బాదుడు అనే కార్యక్రమాల పేరుతో చంద్రబాబు రోడ్డున పడ్డా ఫలితం లేకపోగా తన హయాంలో చేసిన అనేక అక్రమాలు, అవినీతి పనుల పై విచారణలో భాగంగా పక్కా సాక్ష్యధారాలతో దొరికిపోయిన చంద్రబాబు యాభై రెండు రోజుల జైలు జీవితం గడిపి 14 తీవ్ర అనారోగ్య కారణాలు చూపి బెయిల్ పొందారు. అయితే సభల్లో తన కేసు విషయాలు మాట్లాడకూడదు అన్న బెయిల్ నిభందనలు ఉల్లంఘిస్తూ తనని అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తూ సాగుతున్నారు చంద్రబాబు.
అయితే జగన్ మాత్రం ఇవేవి పట్టించుకోవట్లేదు అనుకొంటా.
తన పని తాను చేసుకొంటూ పోతున్నాడు. ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటి నుండి మేనిఫెస్టోలో తానిచ్చిన హామీలు తూచా తప్పకుండా నెరవేర్చటమే కాకుండా కరోనా లాంటి విపత్కర సమయంలో రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడంలో చూపిన పనితీరు దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకొంది.
ఒక హుదూద్ తుఫానుకి రోడ్డు మీద పడ్డ నాలుగు చెట్లు, కరెంట్ స్థంబాల్ని తొలగించిన విషయం అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా ఇప్పటికీ చెప్పుకొంటుంటాడు చంద్రబాబు. హుదూద్ విజయం పేరిట కేకులు కోసి సంబరాలు చేసుకొన్నాడు కూడా.
కానీ కోట్ల మంది ప్రజల్ని తన రెక్కల కింద కోడి పిల్లల్లా కాపాడిన జగన్ ఒక్కరోజు కూడా ఇది నా ఘనత మీ ప్రాణాలు కాపాడింది నేనే అని ఒక్కమాట కూడా అనలేదు. ముఖ్యమంత్రిగా అది తన భాద్యత అన్న భావనతో కర్తవ్యం నెరవేర్చాడంతే.
కరోనా కష్టకాలంలో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని, పడ్డ ఆర్ధిక నష్టాల్ని ఒక్కో మెట్టుగా అధిగమిస్తూ తానిచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో పురోగతి సాధించే దిశగా చేపట్టిన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు .
అంతేకాదు జగన్ కొత్తగా ఏర్పాటు చేసిన విలేజ్ వలంటీర్, గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాల వంటి నూతన వ్యవస్థలు దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకోవటమే కాక ఇతర రాష్ట్రల్లో కొన్ని దేశాల్లో ఇదే తరహా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవటానికి రాష్ట్రాన్ని మోడల్ గా నిలిపారు జగన్. అయినా కూడా డ్వాక్రా సంఘాలు నేనే తెచ్చా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అనే బాబులాగా ఏ రోజూ గొప్పలకు పోలేదు.
తానేం చేశానో ప్రజలకు కనపడుతూనే వుంది. చేస్తున్న దాన్ని మరింత మెరుగ్గా ఎలా చేద్దాం, కొత్తగా ఏమి చేద్దాం అనే తపనలో భాగంగా రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుండి దాదాపు ప్రతి వ్యక్తి నుండి అభిప్రాయ సేకరణకు ఆలోచన చేశాడు .
ఆ ఆలోచనకి ప్రతిరూపమే గడపగడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం.
గత మూడేళ్లగా ప్రభుత్వ పనితీరు ఎలా వుంది, సంక్షేమ, అభివృద్ధి పధకాల ఫలాలు అర్హులైన ప్రతి వారికి అందుతున్నాయా లేదా తెలుసుకోవటంతో పాటు వాటిని మరింత మెరుగ్గా రూపొందించే ఆలోచనలు కూడా ప్రజలతో పంచుకోవడానికి ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి పలకరించే విధంగా రూపుదిద్దిన ఈ కార్యక్రమం దేశంలోనే కాదు బహుశా ప్రపంచంలో కూడా ప్రధమం అనుకొంటా . దీని తర్వాత జగనన్న సురక్ష కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున ఆదరణ పొందుతుంది.
ఈ కార్యక్రమాల్లో భాగంగా కుల, మత, ప్రాంత, రాజకీయ వర్గ ప్రమేయం లేకుండా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించే ప్రతి ఎమ్మెల్యే వెనుక లీలగా జగన్ కనపడతాడు ఆ ఇంటి వారికి అంటే అతిశయోక్తి కాదేమో .
2018 లో తానొక్కడే నడిచాడు . 2023 నాటికి గడపగడప కార్యక్రమం ద్వారా అడుగు కదపకుండా అంతటా తానై నిలిచాడు .
ఇలాంటి పరిస్థితులలో మధ్య యువగలం, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ అంటూ తండ్రి కొడుకులు వెళ్లిన ప్రతి చోటా, పలకరించిన ప్రతి మనిషి వెనక సంక్షేమ, అభివృద్ధి పధకాల రూపంలో జగన్ రూపం లీలగా కనపడుతుంటే అసహనం తట్టుకోలేక అసత్య ఆరోపణలు, తిట్లు, సవాళ్లు, దుడుకు చర్యల రూపంలో ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు తండ్రి కొడుకులు.
ఈ తరహా రాజకీయాలకి కాలం చెల్లింది. ఎప్పుడో మొక్కుబడిగా చేసిన చిల్లర పనులు బృహత్తర కార్యాలుగా చెబితే నమ్మిన 1995, 2014 కాలం నాటి వారు కాదు ప్రజలు. కానీ చంద్రబాబు మాత్రం ఆ కాలం కుట్రా రాజకీయాల్నే నమ్ముకొన్నట్టు వుంది. ఆయన నమ్ముకోవటమే కాకుండా కొడుక్కి కూడా ఆ కాలం నాటి రాజకీయాలే నూరిపోసినట్టు కనపడుతుంది.
అచ్చంగా బాబు గారిలాగే చేయనివి చేశా అనే అబద్దాలు, కాకి లెక్కలు, అసత్య ప్రచారాలు, లేకి ఆరోపణలు, బూతులతో భారంగా సాగుతుంది లోకేష్ యువగలం. దురదృష్టం ఏంటంటే నమ్మి తన వెంట వచ్చిన వారు ఏమైపోయినా పట్టించుకోకుండా ముందుకు పోయే బాబు గారి శైలి అచ్చు గుద్దినట్టు వచ్చింది లోకేష్ కి కూడా. యువగలం మొదటి రోజే తన వెంట వచ్చిన తారకరత్న నేలరాలుతున్నా కూడా ముందుకు సాగాడే తప్ప ఆగి చూడలేదు . భాద్యత తీసుకోలేదు .
అంతిమంగా చూస్తే తనపర భేదం లేకుండా రాష్ట్రంలో ప్రతి గడపలో చిద్విలాసంగా నవ్వుతూ ఆ కుటుంబ పెద్దబిడ్డలా నిలబడ్డ జగన్ ని దాటి జగన్ కుటుంబ సభ్యుల లాంటి ప్రజల్ని తన వైపు తిప్పుకోగలుగుతుందా టీడీపీ,
విశ్వసనీయత పొందగలుగుతుందా,
స్థిరంగా నిలబడగలుగుతుందా,
జగన్ ని తట్టుకొని మనగలుగుతుందా,
ఏ రాజకీయ పార్టీ వారైనా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఈ నాలుగు ప్రశ్నలు మననం చేసుకొని ఆలోచిస్తే వారి మనోనేత్రం ముందు కనపడేది ఒక్క రూపమే.
అది మేరు పర్వతం అంత ఎత్తు ఎదిగిన జగన్ రూపం .