ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలమైన అభ్యర్థిగా ఉన్న కేశినేని నానికి టీడీపీ నాయకత్వం టికెట్ విషయంలో మొండిచెయ్యి చూపిన విషయం తెలిసిందే. టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి గెలుస్తానని మొదటినుండి చెప్తూ వస్తున్న కేశినేని నాని తాజాగా సీఎం జగన్ తో భేటీ కావడం కృష్ణా జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది.
2019 ఎన్నికల్లో బలంగా వీచిన ఫ్యాన్ గాలిలో కూడా టీడీపీ నుండి గెలిచిన అతికొద్ది మంది నాయకుల్లో ఎంపీ కేశినేని నాని కూడా ఒకరు. కాగా ముక్కుసూటిగా ఉండే వ్యక్తిగా, కృష్ణా జిల్లా రాజకీయాల్లో కమ్మ సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరున్న కేశినేని నానికి తిరిగి టికెట్ ఇచ్చే విషయంలో లోకేష్ అడ్డుపడ్డారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కేశినేని నానిని పక్కనబెట్టి ఆయన సోదరుడైన కేశినేని చిన్నికి టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించడం, అందుకు అనుగుణంగానే పొమ్మనలేక పొగబెట్టే కార్యక్రమాలకు టీడీపీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రోటోకాల్ ప్రకారం ఫ్లెక్సీలలో వేయాల్సిన ఎంపీ నాని ఫోటోలను ఉద్దేశ్యపూర్వకంగా వేయకపోవడంతో కేశినేని నాని మరియు చిన్ని వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.
అనంతరం కేశినేని నాని టీడీపీతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడంతో విజయవాడ రాజకీయాలు వేడెక్కాయి. దాంతో ఆయనను బుజ్జగించేందుకు కనకమేడల రవీంద్ర కుమార్ ను టీడీపీ రంగంలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది. ఆయన బాటలోనే నాని కుమార్తె శ్వేతకూడా టీడీపీకి గుడ్ బై చెప్పి విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన కుమార్తెతో కలిసి సీఎం జగన్ ని కలవడంతో త్వరలోనే వైఎస్సార్సిపిలో చేరనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఏదేమైనా విజయవాడలో బలమైన నేతగా ఉన్న కేశినేని నాని తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరితో కృష్ణా జిల్లా రాజకీయాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పడం ఖాయంగా కనిపిస్తుంది.