ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలై మూడు రోజులు కావస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏ పార్టీ తరపున పోటీ చేస్తాడు అనే విషయం ఇంకా తేలలేదు. అనపర్తి నియోజవర్గానికి చెందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ సీటు కూటమిలో భాగంగా బిజెపి దక్కించుకుంది. బిజెపి తరఫున కృష్ణంరాజుని అభ్యర్థిగా ప్రకటించేసింది కూడా అయినా రామకృష్ణ రెడ్డి తనకు ఎటు తిరిగి ఆ సీట్ కావాల్సిందే అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దగ్గర పట్టుపట్టాడు. ఒకానొక సందర్భంలో అనపర్తి నియోజవర్గంలో ప్రకంపనలే సృష్టించాడు. చంద్రబాబు నాయుడు బుజ్జగించాలని ప్రయత్నించిన రామకృష్ణ రెడ్డి దేనికి ఒప్పుకోలేదు.
నామినేషన్లకి ఇంకా మూడు రోజులే గడువున్న సందర్భంలో రామకృష్ణారెడ్డి అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారు అయినప్పటికీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు అనే స్పష్టత రాలేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రామకృష్ణారెడ్డిని బిజెపిలో జాయిన్ అయ్యి ఆ పార్టీ తరపున పోటీ చేయమని రామకృష్ణారెడ్డిని కోరింది. టిడిపి అధినాయకత్వం కూడా రామకృష్ణారెడ్డిని బిజెపిలోకి వెళ్లి ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. కానీ రామకృష్ణారెడ్డి మాత్రం ఎన్నికల బరిలో ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే ఉంటా బీజేపీలోకి వెళ్ళను అని తెగేసి చెబుతున్నాడు. నామినేషన్ల గడువు ముగుస్తున్న తరుణంలో రామకృష్ణారెడ్డి మనసు మార్చుకొని బిజెపిలోకి వెళ్తాడా లేక టిడిపి వాళ్లు ఆ సీటు తీసుకొని బిజెపికి వేరే సీటు కేటాయిస్తారా అనే విషయం రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనపర్తి సీటులో ఒకవేళ టీడీపీ పోటీ చేయదలిస్తే బిజెపి దెందులూరు లేదా తంబాలపల్లి నియోజకవర్గాలలో ఏదో ఒక సీటు కోరే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.