సలార్ సినిమాలో వరదరాజ మన్నార్‌ను అతని తమ్ముడు మన ఆర్మీ ఎక్కడన్నా.. చెప్పు ఎవర్ని తెచ్చుకుంటున్నాం.. ఎంతమంది వస్తారు.. అని పదేపదే ప్రశ్నిస్తాడు. అందుకు వరద మౌనంగానే ఉంటాడు. ఇదే సీన్‌ను మన ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు, లోకేశ్‌కు అన్వయించుకుని చూడండి.. ఊహిస్తేనే భయమేస్తోంది కదా.. నిజమే.. అసలు బాబుకు ఇప్పటి వరకు పూర్తి ఆర్మీ లేదు∙కదా.. అందుకే కొడుక్కి సమాధానం చెప్పడానికి సమయం తీసుకుంటున్నాడు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఐదో జాబితా కూడా ప్రకటించింది. ఇందులో కొన్ని మార్పులు కూడా జరిగాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌కు ప్రమోషన్ వచ్చి నరసారావుపేట ఎంపీ స్థానానికి పంపారు. ఇలా జగన్ తన ఆర్మీని ప్రకటించుకుంటూ పోతున్నారు. బాబు మాత్రం తనతో ఎవరు జత కలుస్తారా?, అధికార పార్టీలో మిగిలిపోయిన వారికి ఏదో ఒకటి చెప్పి తీసుకొచ్చుకుందామా అనే ఆలోచనలో మునిగిపోయాడు.
తాజాగా ఆంధ్రజ్యోతిలో 13 ఎంపీ సీట్లను తెలుగుదేశం ఖరారు చేసిందని వార్త వచ్చింది. అందులో ముగ్గురు వైఎస్సార్సీపీ వాళ్లే. వారిలో నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి టికెట్ లేదని తెలియడంతోనే బయటికి వెళ్లిపోయారు. లావు టీడీపీ ముఖం, బాలశౌరి జనసేన ముఖం చూస్తున్నారు. వారి సిటింగ్ స్థానాల్లో అవకాశమని ఎల్లో పత్రిక రాసింది. ఇక నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చంద్రబాబుకు అమ్ముడిపోయి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చాలా కాలంగా నిందలు వేస్తున్నారు. జగన్‌ను తిడుతున్నందుకు ఇతనికి అదే స్థానం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎన్నికల్లో చాలా మార్పులు చేస్తోంది. కొందరు సిటింగ్‌లను పక్కన పెట్టింది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అలా టికెట్ లేదని చెప్పిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ కండువా కప్పేసుకున్నారు. అయితే వీరి టికెట్లను బాబు ఇంకా ఖరారు చేయలేదు.
బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2014లా జనసేనతో కలిపి ముగ్గురు ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావన. అయితే కమలం పెద్దలు ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదు. కొన్ని షరతులు విధించారని ప్రచారం జరుగుతోంది. పొత్తుల వ్యవహారం డిసైడ్ అయితేనే సీట్ల విషయం తేలుతుంది. ఇంకో పక్క జగన్ సీట్లన్నీ ప్రకటించగా అరకొరగా ఉండే అసంతృప్తులను తీసుకొళ్లాలనేది బాబు ప్లాన్. అప్పుడైతే వైఎస్సార్సీపీ ఖాళీ అని ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేయించవచ్చు. అందువల్ల లోకేశ్ మన ఆర్మీ ఎక్కడ డాడీ అని అడిగినా చంద్రబాబు మౌనంగా చూస్తాడే తప్ప సమాధానం మాత్రం చెప్పలేడు. ఈ పరిమాణాలన్నీ చూసి తెలుగు తమ్ముళ్లు మా నాయకుడు ఇక మారడని గొణుక్కుంటూ పైకి మాత్రం నవ్వుతూ తిరుగుతున్నారు.