తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి విజన్‌కు ప్రపంచమంతా నివ్వెర పోతోంది. సాంకేతిక పరిజ్ఞానంపై ఆయనకున్న అవగాహనను చూసి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలే ఆశ్చర్యపోతున్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్‌పై బాబుకు ఉన్న పట్టును చూసి అందరూ కుళ్లుకుంటున్నారు. ఇంతకీ ఏమన్నారనే కదా.. ఆదివారం కృష్ణా జిల్లాలో ప్రజాగళం సభలు జరిగాయి. ‘జగన్ ఇంగ్లిష్ నేర్పిస్తారట. ఈతరం వాళ్లకి ఇంగ్లిష్ నేర్పించేదేంటి?, ఇప్పుడు యువతకు ఐటీ నేర్పించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కావాలి. నేను నేర్పిస్తా. జగన్ రాతియుగం వైపు తీసుకెళ్తే.. నేను స్వర్ణయుగం వైపు తీసుకెళ్తా. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి తెలుగు పిల్లలందరికీ అండగా ఉంటాను’ అంటూ నారా వారు తన విజ్ఞాన ప్రదర్శన చేశారు.
కొద్దోగొప్పో చదువుకున్న ప్రతి ఒక్కరికీ చంద్రబాబు మాట్లాడిన విషయాలు అర్థమైపోతాయి. ఐటీ, ఏఐ సబ్జెక్టులు ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. వాటిని నేర్చుకోవాలంటే ఆ భాషపై పట్టుండాలి. కానీ ఇంగ్లిష్ అవసరం లేదని బాబు సెలవిచ్చారు. దీంతో ఆయన విజన్‌ను చూసి జనమంతా పిచ్చోళ్లు అయిపోతున్నారు. అసలు చిన్నపటి నుంచి బడిలో నేర్చుకోకపోతే వారికి ఆ భాష ఎలా వస్తుంది?, పైగా అది మన మాతృభాష కూడా కాదు. కానీ నారా వారు నోటికొచ్చింది చెప్పేశారు. మరి ఆయన వద్ద ఇంగ్లిష్తో సంబంధం లేకుండా ఆ రెండు సబ్జెక్టులు నేర్చుకునే కిటుకు ఏమైనా ఉందేమో..
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల పిల్లల కోసం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. ఐటీ, ఏఐ ఇలా ఏది నేర్చుకోవాలన్నా, వాటికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో అందుకోవాలన్నా ఇంగ్లిష్‌పై పట్టు తప్పనిసరి. జగన్ అదే చేస్తే పచ్చ గ్యాంగ్ తప్పుగా చిత్రీకరించింది. మరి ఐటీ, ఏఐ ఎలా నేర్చుకోవాలో.. ఎలా నేర్పిస్తారో.. ప్రపంచ మేధావి అయిన శ్రీశ్రీశ్రీ చంద్రబాబు చెప్పాలి.
చంద్రబాబు దేశానికి ఐటీని తానే తెచ్చాడంటాడు. ప్రజల చేతుల్లో ఫోన్లు ఉండడానికి కారణం నేనేనంటాడు. కానీ ఆ సబ్జెక్టులు చదవాలంటే ఇంగ్లిష్ వచ్చి ఉండాలన్న విషయంపై మాత్రం ఆయనకు అవగాహన లేదు. బాబు దృష్టిలో పెత్తందారుల పిల్లలే చదువుకోవాలి. కార్పొరేట్ విద్యాసంస్థలు బాగుండాలి. పేద పిల్లలకు ఇంగ్లిష్ సబ్జెక్టు చదివే అర్హత లేదని ఆయన ఉద్ధేశంలా తెలుస్తోంది.
తెలుగుపై ప్రేమ ఉన్నట్లు ఐదేళ్లుగా ఎల్లో గ్యాంగ్ నటిస్తోంది. కానీ తమ పిల్లలకు ఇంగ్లిష్ చదువులే చెప్పిస్తున్నారు. మరోవైపు టీడీపీ నాయకులకు కార్పొరేట్ బడులున్నాయి. అవి కళకళలాడాలంటే ప్రభుత్వ బడులు నాశనమైపోవాలి. కానీ జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి వాటిని నింపేశాడు. అందుకే కొత్త కొత్త రాగాలు అందుకున్నాడు చంద్రబాబు. అసలు ఇంగ్లిష్తో సంబంధం లేకుండా ఏఐ, ఐటీ నేర్పించాలని చెప్పడం ఆయనకే చెల్లుబాటైంది. ఆయన, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఆ కోవలోనే చదివారేమో..