రాష్ట్రంలో ఎన్నికల సమరభేరి మోగింది. దీంతో నాలుగు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృతంగా మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే పలువురు అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు ఎంపీ స్థానం నుండి పోటీ పడుతున్న విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. వైసిపి రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన వీరిద్దరూ ఒకరినొకరు విమర్శించుకోవడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవలే టీడీపీలో చేరి నెల్లూరు ఎంపీగా పోటీకి దిగారు. దీంతో ఆయనకు సరైన ప్రత్యర్థిని పోటీగా నిలపాలని భావించిన సీఎం జగన్ వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీగా బరిలోకి దింపారు. సాయిరెడ్డి గెలిస్తే నెల్లూరును పట్టించుకోరని, ఢిల్లీకి ఎక్స్ పోర్ట్ అవుతారంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన విమర్శకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలతో నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి.
ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్లు చేస్తున్నందు వలన అలవాటు ప్రకారం వేమిరెడ్డి ఆ పదం వాడి ఉంటారని తనకు ఏ వ్యాపారాలు లేవని విజయసాయిరెడ్డి సామాజిక మాధ్యమం అయిన ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. పార్లమెంటు సమావేశాలప్పుడు తప్ప మిగిలిన రోజులు నెల్లూరులోనే ఉంటానని, ప్రాణం పోయేవరకు జగన్ గారి వెంటే ఉంటానని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రతి రోజూ సభకు హాజరయ్యానని, రాష్ట్ర సమస్యలను ఎక్కువగా ప్రస్తావించింది తానే అని విజయసాయిరెడ్డి వెల్లడించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ మెంబరుగా అటు పార్లమెంటుకు రాలేదు. ఇటు నెల్లూరులో లేరని వ్యాపార పనుల్లో దేశాలు తిరుగుతున్నారని పార్టీలు మారడం తనకు తెలియదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.విజయసాయిరెడ్డి కౌంటర్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి