పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్), ప్రశాంతిరెడ్డి దంపతులు డబ్బు గర్వంతో విర్రవీగుతున్నారని నెల్లూరు జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోంది. కుటుంబానికి ఒక టికెట్ అని చెప్పిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వీరి విషయంలో మాత్రం మాట తప్పారు. ఎన్నికల ఖర్చులకు వందల కోట్ల రూపాయలు ఇవ్వడంతో వీపీఆర్‌కు నెల్లూరు ఎంపీ, ప్రశాంతిరెడ్డికి కోవూరు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు.
వేమిరెడ్డి తెలుగుదేశంలో చేరిన నాటి నుంచి డబ్బుతోనే రాజకీయాలు చేస్తున్నారు. తనకంటూ ప్రత్యేకంగా వర్గం ఏర్పాటు చేసుకునేందుకు రూ.కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఎంత కావాలన్నా ఇస్తానని తన మనుషుల తెలుగు తమ్ముళ్లనే పిలిపించుకుని సన్మానాలు చేయించుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలను ప్రలోభాలను గురి చేయాలని చూడగా ఎవరూ స్పందించలేదు. ఎమ్మెల్యేలైతే కనీసం ఆయన్ను పట్టించుకోలేదు. అతికొద్దిమంది చోటా నాయకులను ప్రలోభపెట్టి తీసుకుంటున్నారు. ఇక టీడీపీ ఇన్చార్జిగా ఉన్న పోలంరెడ్డి దినేష్‌రెడ్డి తనకు టికెట్ ఇవ్వలేదని చంద్రబాబుపై నాలుగైదు రోజులు ఫైరయ్యారు. ఇతనికి రూ.20 కోట్లు అందజేసి నోరు మూయించినట్లు సమాచారం.
కోవూరు నియోజకవర్గంలో నిత్యం చేరికలు ఉండేలా వీపీఆర్ ప్లాన్ వేశారు. ఈ బాధ్యతలను తన మనిషి రూప్‌కుమార్ యాదవ్‌కు అప్పగించారు. ఈయన ఇతర పార్టీల నాయకులకు డబ్బు ఎరగా చూపుతున్నారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్టులు ఇప్పిస్తామని చెబుతున్నారు. మండల, గ్రామ స్థాయి నాయకులను చేర్చేసుకుని మేమే గెలిస్తున్నామని హైప్ తెచ్చే ప్రయత్నం కొద్దిరోజులుగా జరుగుతోంది. డబ్బు ఉంటే చాలు. రాజకీయాలు చేసేయొచ్చని ఆలోచనలో వీపీఆర్ దంపతులున్నారు. పైకి మాత్రం సేవామూర్తులమని చెబుతూ లోపల మాత్రం ధన రాజకీయాలు చేస్తున్నారని విమర్శలున్నాయి.
మండల స్థాయి నాయకుడికి రూ.50 లక్షలు, పంచాయతీ స్థాయి అయితే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఇస్తామని టీడీపీలో చేరాలని బేరాలకు దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కోవూరు నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. అందుకే వీపీఆర్ దంపతుల వ్యవహారాలు ఇంకా పూర్తిస్థాయిలో సాగడం లేదు. తాజాగా ప్రశాంతిరెడ్డి ఆడియో వ్యవహారం బయటపడడంతో రూప్‌కుమార్ యాదవ్‌ను వెంటనే రంగంలోకి దింపారు. ఇదంతా వైఎస్సార్సీపీ కుట్ర అని వీపీఆర్ అతని నోటి వెంట చెప్పించారు. ఫోన్లో మాట్లాడి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయినా విజయసాయిరెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డిపై అభాండాలు వేశారు. అంతేలే.. ఆనాడు స్వయానా చంద్రబాబే ఓటుకు రూ.కోట్లు ఇస్తామని మాట్లాడి దొరికిపోయి బుకాయించాడు. అతని పార్టీ నాయకులు మంచిగా ఉంటారనుకుంటే పొరపాటే.. డబ్బులిచ్చి ఓట్లు కొనాలనే కదా చూస్తారు.