తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్), ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి చీప్ ట్రిక్స్ చూసి ప్రజానీకం నవ్వుకుంటున్నారు. టీడీపీని ఎవరూ పట్టించుకోవడం లేదని, హైప్ తెచ్చేందుకు పార్టీలో ఉన్న వారికే కండువాలు కప్పేస్తున్నారు. వారు చేరారు.. వీళ్లు చేరారు.. వైఎస్సార్సీపీ ఖాళీ అయిపోయిందని చీప్ ట్రిక్స్ ప్లే చేసి సంబర పడిపోతున్నారు.
మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు చాలా ఏళ్ల నుంచి టీడీపీలోనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ కోసమే పనిచేశారు. అయితే గురువారం ఆయన వీపీఆర్, ఆనం సమక్షంలో తెలుగుదేశంలో చేరారని ఫొటోలు బయటకు రావడంతో ఆత్మకూరు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. కొత్తగా కొమ్మి చేరడం ఏంటి.. దానికి వాళ్లిద్దరూ బిల్డప్ ఇవ్వడం ఏంటని ఒకరికొకరు చెవులు కొరుక్కున్నారు. కొమ్మి, ఆయన మనుషులు ఈనెల మొదటి వారంలో ఆనంతో కలిసి వివిధ మండలాల్లో ప్రచారం కూడా చేశారు. అయితే ఇప్పుడు చేరారంటూ కండువాలు ఎందుకు కప్పారని చోటా నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఆనం, కొమ్మికి రాజకీయంగా విభేదాలున్నాయి. రామనారాయణరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని కొమ్మి తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కమ్మ సామాజికవర్గం తన కోసం పనిచేయదనే భయంతో ఆనం ఇటీవల ఆయన్ను కలిసి చర్చించారు. ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నామని, కలిసి పనిచేద్దామని బతిమిలాడారు. లక్ష్మయ్య నాయుడు సరే అనడంతో కలిసి ప్రచారం చేశారు. తాజాగా ఆనం కొమ్మిని వీపీఆర్ ఇంటికి తీసుకెళ్లి పచ్చ కండువా కప్పించడం, ఆయన ఆత్మకూరులో వైఎస్సార్సీపీ పనైపోయిందని చెప్పి అభాసుపాలయ్యారు.
వీపీఆర్ టీడీపీలో కొత్త సంస్కృతికి తెరలేపారు. తాను చాలా బలవంతుడినని, పెద్ద వర్గముందని చంద్రబాబు నాయుడి వద్ద మార్కులు కొట్టేసేందుకు టీడీపీలో ఉన్న వారికే కండువాలు కప్పేస్తున్నారు. వీపీఆర్కి జై కొట్టిన నేతలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఇలాగే జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా తెలివిగా వేమిరెడ్డి డబ్బు కోసం టీడీపీ కార్యకర్తల్ని ఆయన వద్దకు తీసుకెళ్లి కండువాలు కప్పించి జేబులు నింపుకొంటున్నారు.