వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్) తీరుపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. డబ్బుతో ఇతర పార్టీల వారిని ప్రలోభపెట్టి తీసుకొస్తూ సీనియర్ టీడీపీ నాయకులకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. ఆయన నియంతృత్వ పోకడలపై కోపంగా ఉన్నా ఏమి చేయలేని పరిస్థితుల్లో లోలోన మదనపడిపోతున్నారు.
వీపీఆర్ టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌కు, ఆయన భార్య ప్రశాంతిరెడ్డి కోవూరు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఎంపీ పరిధిలో నెల్లూరు సిటీ, రూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాలున్నాయి. ఒక్క సిటీ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఖర్చు మొత్తం వేమిరెడ్డిదే. ఈ షరతుతోనే చంద్రబాబు నాయుడు ఆయన్ను చేర్చుకుని ఎవర్నీ సంప్రదించకుండా జిల్లా బాధ్యతలన్నీ అప్పగించేశారు. సీనియర్ నేతలను కాదని ఆయన్ను అందలం ఎక్కించడంపై పార్టీలో తీవ్ర విభేదాలున్నాయి. వీపీఆర్ పార్టీని జనంలో చులకన చేసే విధంగా ప్రవర్తిస్తున్నారనే ప్రచారం ఉంది.
ఇతర పార్టీల నుంచి చేరికలు తెలుగు తమ్ముళ్లకు అస్సలు నచ్చడం లేదు. దశాబ్దాల నుంచి తాము కష్టపడి పనిచేస్తోంటే.. వీపీఆర్ కొత్త వారిని తీసుకొచ్చి పెత్తనం చెలాయించే అవకాశం ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో తన మాటే వినాలనే ధోరణలో ఆయన ఉన్నారు. చేరికలు, ఇతర ఖర్చుల కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.100 కోట్లు కేటాయించినట్లు సమాచారం. అధికార దాహంతో పచ్చ పల్లెల్లో గొడవలకు ఆజ్యం పోస్తున్నారు.
సిటీ మొత్తాన్ని అభ్యర్థి పొంగూరు నారాయణ చూసుకుంటున్నారు. ఆయనకు వేరే వారి డబ్బుతో అవసరం లేదు. దీంతో మిగిలిన ఆరు నియోజకవర్గాలను వీపీఆర్ మనుషులు చూసుకుంటున్నారు. ఇతర పార్టీల నాయకులను డబ్బుతో ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఆశ పెడుతున్నారు. వేమిరెడ్డికి ప్రజా బలం శూన్యం. దీంతో ఈ తరహా రాజకీయాలకు తెర తీశారు. ఇష్టమొచ్చినట్లు డబ్బు పంచేసి నేతల్ని చేర్చుకుంటుండంతో మొదటికే మోసం వస్తోంది.
టీడీపీ కోసం పనిచేసిన వారికి ప్రస్తుతం ప్రాధాన్యం లేకుండా పోయింది. వేమిరెడ్డి హవా ఉండడంతో ఆయన డబ్బు తీసుకుని చేరిన వారు పాత నేతలపై పెత్తనం చేయాలని చూస్తున్నారు. ఈ విషయాలన్నీ అధిష్టానం దృష్టికి వెళ్లినా పట్టించుకోవడం లేదు. దీంతో అభ్యర్థులు పైకి చెప్పకపోయినా సన్నిహితుల వద్ద తెగ బాధపడితున్నారు. రోజురోజుకు గ్రామాల్లో నేతల మధ్య విభేదాలు ఎక్కువైపోతున్నాయని, ఎన్నికల నాటికి ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయని, దీనంతటికీ వేమిరెడ్డే కారణమని ఆగ్రహంగా ఉన్నారు.
ఒకసారి రండి మాట్లాడుకుందామని పిలవడం.. వెళ్లాక ఖర్చులకు ఉంచు అని డబ్బు బ్యాగ్ ఇవ్వడం.. టీడీపీ కండువా కప్పేయడం.. ఇదే వీపీఆర్ సింహపురిలో చేస్తున్న రాజకీయం. దీంతో ఇంతకాలం పెద్ద మనిషిలా కనిపించిన వ్యక్తి ఒక్కసారిగా విలన్ అయిపోయాడు. వేమిరెడ్డి వల్ల తెలుగుదేశం నాశనమైపోతోందని జెండా మోసిన కార్యకర్తలు బహిరంగంగానే తిడుతున్నారు.