ఈనెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు ఎంత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అధికార, ప్రతిపక్ష పార్టీల వాగ్వాదాలు, వాదోపవాదాలు, ఎన్నికల ప్రచారాలు, మేనిఫెస్టోల ప్రకటనలు ఇలా అనేక రకాలుగా రాష్ట్రంలో వేడిని పుట్టిస్తున్నాయి. అయితే రాష్ట్రమంతా జరిగే ఎన్నికలు ఒక ఎత్తు అయితే పిఠాపురం లో జరిగే ఎన్నికలు మరొక ఎత్తుగా మారాయి. పిఠాపురం నియోజకవర్గ ప్రజలతోపాటూ రాష్ట్ర ప్రజల అందరి దృష్టి అక్కడే ఉంది. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయడమే…
అయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పిఠాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసి, గెలిచిన వంగా గీత పోటీ చేస్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్, అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి వంగా గీత ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గ ఎన్నికలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకోవటమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి వంగా గీత తన అనుచరగణంతో స్థానిక నాయకులతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కూటమి ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ మాత్రం జబర్దస్త్ ఆర్టిస్టులు, సీరియల్ నటులు, మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారందరూ పవన్ కళ్యాణ్ కి లక్ష మెజారిటీ గ్యారెంటీ అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. అయితే ఈ విషయం మీద స్పందిస్తూ లక్ష మెజారిటీ గ్యారెంటీ అనుకున్నప్పుడు ఇప్పటికే పవర్ స్టార్ అని పిలవబడుతున్న పవన్ కళ్యాణ్ కి ఈ బుల్లితెర స్టార్లు సీరియల్ ఆర్టిస్టులు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే పవన్ కళ్యాణ్ స్టార్డం కంటే కూడా ఈ బుల్లితెర నటులు జబర్దస్త్ ఆర్టిస్టుల స్టార్డం పెద్దదని పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటున్నాడా అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీత సెటైర్లు విసిరారు.