చేప పులుసుని తలుచుకుంటే చాలు.. నోరూరిపోతోంది కదా.. తీర ప్రాంతాల్లో ఉండే వారు సముద్ర చేపల్ని ఇష్టంగా తింటుంటారు. అదే వంజరం, మాఘ, కొమ్ము తదితర వాటికి డిమాండ్ చాలా ఎక్కువ. ఆరోగ్య దృష్ట్యా చికెన్, మటన్ కంటే చేపల్ని తినేవారి సంఖ్య అధికంగానే ఉంది. మన రాష్ట్రంలో తీరం నుంచి ఇతర ప్రాంతాలకు ఆహార ఉత్పత్తుల ఎగుమతి అధికంగా ఉంటుంది. సముద్ర చేపల్ని తినే వారికి ఇది నిజంగా చేదు వార్త. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా రెండు నెలలపాటు వేటకు విరామం ఇవ్వాలని మత్స్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో చేపలు పట్టకూడదు.
సముద్రంలో మత్స్య సంపద అభివృద్ధి కోసం చేపల సంతానోత్పత్తి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 61 రోజులపాటు వేటకు విరామం ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే సముద్రంలో మత్స్యకారులు చేపల వేట చేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ సమయంలో వారి జీవనానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.10 వేల చొప్పున పరిహారం అందించింది. ఈ ఏదాడి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలింగ్ పూర్తయ్యాక సొమ్ము అందించేందుకు చర్యలు చేపట్టింది.
తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారుల బాగోగులు పట్టించుకోలేదు. వేటకు విరామం ప్రకటించినప్పుడు వారంతా రోజు గడవక అష్టకష్టాలు పడేవారు. రిలీఫ్ కమ్ సేవింగ్స్ స్కీమ్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రూ.1,800 అందించేవి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ ఏడాది ఈ పథకాన్ని సైతం ఎగ్గొట్టారు. 2015-16లో కుటుంబానికి రూ.2వేలు మాత్రమే అందించారు. 2019లో ఎన్నికలు రావడంతో వేట విరామ పరిహారాన్ని రూ.4 వేలకు పెంచి కొంతమందికే ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. వేట విరామ పరిహారాన్ని రూ.10 వేలకు పెంచారు. మత్స్యకార ప్రమాద బీమాను రూ.10 లక్షలకు, డీజిల్పై సబ్సిడీ రూ.9కు పెంపుదల చేశారు. 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్లు పంపిణీ చేశారు