ఇచ్చిన మాట ప్రకారం విశ్వసనీయతను చాటుకుంటూ పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం జగన్ నేడు పూర్తిస్థాయిలో నెరవేర్చనున్నారు. వైయస్సార్ ఆసరా నాలుగో విడతలో భాగంగా రూ.6,394.83 కోట్లను బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. తద్వారా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ అప్పట్లో పొదుపు సంఘాల మహిళలకు ఆయన ఇచ్చిన హామీని నేడు ముఖ్యమంత్రి జగన్ సంపూర్ణంగా అమలుచేస్తున్నారు.
2014 ఎన్నికల్లో పొదుపు సంఘాల మహిళల రుణాలను మాఫీ చేస్తానని మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు, ఏపీ అసెంబ్లీ సాక్షిగా పొదుపు సంఘాల మహిళలను వంచించారు. డ్వాక్రా రుణాలను సకాలంలో చెల్లించని కారణంగా దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక పొదుపు సంఘాలు ఆర్థికంగా చితికిపోయాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల మేర అప్పులుండగా 2019 ఏప్రిల్ 11 ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల మొత్తం అప్పు రూ.25,571 కోట్లు అయింది. ఈ అప్పును నాలుగు విడతల్లో చెల్లిస్తామని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీను తూచా తప్పకుండ అమలుచేస్తూ ఇప్పటికే వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడు విడతల్లో డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.19,175.97 కోట్లు జమచేయగా నేడు మిగిలిన రూ.6,394.83 కోట్లను జమచేస్తూ ఇచ్చిన హామీని సంపూర్ణంగా అమలుచేయనున్నారు.
రాష్ట్రంలో మొత్తం 7.98 లక్షల డ్వాక్రా సంఘాలు ఉండగా ఆ సంఘాల్లో 79 లక్షల మంది డ్వాక్రా మహిళలు సభ్యులుగా ఉన్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి రాష్ట్రంలో మహిళలకు వివిధ పథకాల కింద డీబీటీ (డైరెక్ట్ ) ద్వారా నేరుగా 1.81 లక్షల కోట్లు లబ్దిని చేకూర్చిన ప్రభుత్వం పరోక్షంగా నాన్ -డీబీటీ ద్వారా సుమారు 85,312 కోట్ల లబ్దిని చేకూర్చింది. మొత్తంగా 2.67 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా మహిళలకు అందించి వారికి ఆర్థికంగా, సామాజికంగా భరోసా ఇచ్చింది జగన్ ప్రభుత్వం.