దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రం లో అదింకా ఎక్కువనే చెప్పాలి.. ఫిబ్రవరి చివరికల్లా ఎన్నికల నోటిఫికేషన్లు రావొచ్చనే వార్తల నేపథ్యం లో జగన్ తన పార్టీ నుండి పోటీ చేయబోయే అభ్యర్ధుల జాబితాను దాదాపు పూర్తి చేశారు.. క్యాడర్ ని కూడా సమాయత్తం చేయబోతున్నారు..
మరోవైపు టీడీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది ఎలక్షన్లు మరో రెండు నెలలలోనే ఉన్నా ఇంతవరకు పట్టుమని పది సీట్లను కూడా ప్రకటించలేదు.. జనసేన తో పొత్తు కుదుర్చుకున్నాక టీడీపీ కి కొత్త తలనొప్పులు వచ్చాయనే చెప్పాలి. జనసేన కి ఎన్ని సీట్లు ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? అలాంటి మొదటి అడుగులే ఇంకా పడలేదు. ఒక్క తెనాలి సీట్ విషయం లో నే నానా రభస అయింది, ఇక రాష్ట్రం మొత్తం సీట్లు నిర్ణయిస్తే ఎలాంటి రచ్చ అవుతుందో తెలీదు..
మరో వైపు లోకేష్ వ్యాఖ్యల వలనా, బాబు తనసొంతగా రెండు సీట్లు ప్రకటించడం వలనా, పొత్తు ధర్మాన్ని ముందు నుండే తుంగలో తొక్కుతున్నారు అనే తన సామాజిక వర్గం వారి నుండీ, అభిమానుల నుండి వస్తున్న ఒత్తిడి కారణం గా పవన్ కూడా కాస్త గట్టిగానే అలిగినట్లు నటిస్తున్నారు.. ఇప్పుడు ఆ అలకను ఎలా సవరదీయాలి?
2019 నుండే బీజేపీ తో మరలా సయోధ్య కోసం, మోడీ-షా ల ప్రాపకం కోసం తెగ ఉబలాట పడుతున్నాడు బాబు, కానీ బీజేపీ పెద్దలు మాత్రం బాబుని దూరం పెట్టారు. అయినా పట్టువదలని విక్రమార్కుని లా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 2014 లో బీజేపీ కి బాబుతో పొత్తు కుదిర్చిన VHP తనకి కాస్త అనుకూలం, వారి ద్వారానే మళ్లీ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొన్న అయోధ్య కి ఆహ్వానం అందడం లో కూడా VHP వారి ప్రమేయం ఉంది. అది కూడా మోడీ దృష్టిలో పడాలి అనే అనడం లో ఎటువంటి సందేహం లేదు. పురందేశ్వరి కూడా బాబు కి అనుకూలంగా, పొత్తు ఉండాలనే కోరుకుంటుంది అనేది జగత్విదితం. మరి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బీజేపీ తో పొత్తు ఉంటుందా? ఉంటే బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతుంది? ఎక్కడ అడుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు మళ్లీ ఎదురవుతాయి.. ఒకపక్క జనసేన తో తంటాలు పడుతూ, మరో వైపు బీజేపీ కోసం ఎదురుచూపులు చూస్తూ ఉండటం టీడీపీ కి తలనొప్పి గా మారింది..
ఇక మరోవైపు. బీజేపీ తో పొత్తు కుదరకపోతే కాంగ్రెస్ తో కూడా వెళ్లడానికి బాబు సిద్ధంగా ఉన్నాడు, డీకే శివకుమార్ ద్వారా ఆ కార్యం సులువుగానే నెరవేరుతుందని ఆయనకి తెలుసు. బీజేపీ ఎటూ తేల్చకపోయేసరికి బాబు డైలమా లో పడట్టుగా ఉంది..
వీటన్నిటినీ క్రోడీకరిస్తే, జనసేన తో పొత్తు కొనసాగుతుందా? బీజేపీ పొత్తుకు ఒప్పుకుంటుందా? కాంగ్రెస్ తో వెళ్లాలా? ఎవరికి సీట్లు ఇవ్వాలి? ఎవరి వాటా ఎంత? ఇంతకీ మన బలమేంటి? గెలిచే అవకాశం ఏ మూలైనా ఉందా?
ఇన్ని ప్రశ్నల నడుమ, ఇన్ని సమస్యల నడుమ బహుశా 175 సీట్లలో అభ్యర్థులని నిలబెట్టగలగడం అతిపెద్ద సమస్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో తను ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసే ఛాన్సే లేదు. 2019 లో తప్పక చేయాల్సి వస్తే ఏమైందో ఆయనకి ఇంకా డీటీఎస్ లో వినిపిస్తూనే ఉండొచ్చు..
మొత్తానికి బాబు / టీడీపీ ఇంకా ఎన్నికలకి సిద్దంగా అయితే లేదు. నామినేషన్ ప్రక్రియ లాస్ట్ రోజు వరకూ టీడీపీ లో ఈ నియోజకవర్గం లో ఈ అభ్యర్థే అని కరాఖండీ గా తెలిసే నియోజకవర్గాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చేమో. అంతెందుకు, లోకేష్ ఎక్కడ నుండి పోటీ చేస్తాడో తెలీదు, బాబు కుప్పం లో నే పోటీ అని గ్యారెంటీ లేదు. తమ కంచుకోట అయిన హిందూపూర్ లో మళ్లీ బాలకృష్ణ నే పోటీ చేస్తాడని హామీ లేదు. ఇక పవన్ కల్యాణ్ పోటీ గురించి అయితే దిక్కే లేదు..
ఇంత అనిశ్చితిలో ఎన్నికలకు వెళ్లడం బహుశా టీడీపీ ఎన్నికల చరిత్రలోనే లేదనే చెప్పొచ్చు.
ఇక వైసీపీ పరిస్థితి చూస్తే దీనికి పూర్తి విరుద్ధం.. రెండేళ్ల క్రితమే ఎన్నికల సమయానికి ఎలా సిద్ధంగా ఉండాలో ప్రణాళిక రచించుకున్నారు. ఎమ్మెల్యే లతో సమావేశం అయ్యి సరిగా పని చేయని వారికి ఎంతటి వారైనా టికెట్ ఇచ్చే సమస్యే లేదని తేల్చి చెప్పారు జగన్, చెప్పినట్టుగానే పద్దతి మారని వారికి సీట్లు నిరాకరించారు. కొత్త అభ్యర్థులను బరిలోకి దింపారు. తమ అభ్యర్థులు గడపగడపకు వెళ్లేలా ప్రణాళిక రచించారు, అమలు పరిచారు కూడా. దాదాపు 80% సీట్ల ఖరారు జరిగింది. సామాజిక సమీకరణాల దృష్ట్యా కొంతమందికి స్థాన చలనం కలిపించారు. మొదట్లో కాస్త రచ్చ అయినా జగన్ ముందుగా భావించినట్లుగా ఎన్నికల నాటికి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సర్దుమణిగేలా ఉన్నాయి. అసంతృప్తులను కూడా శాంతపరిచే కార్యక్రమాలు జరుతున్నాయి.. తాను ఎన్నికలకి సర్వసిద్ధం గా ఉన్నానని బహిరంగంగా ప్రకటిస్తున్నాడు జగన్.
అసలు జగన్ నమ్మకం ఏంటి? తను పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై బాగా నమ్మకం పెట్టుకున్నారు. “గతంలో లా కాకుండా ప్రతీ పేదవాడికి ఏదోవిధంగా లబ్ధి చేకూర్చాను, మధ్యవర్తులు లేకుండా, పైరవీలు లేకుండా, లంచాలు లేకుండా అర్హులైన ప్రతీ వ్యక్తికి పథకాలు అందించాను, అది కూడా వారి హక్కులా వారి గడప వద్దకే, వారి ఇంట్లోకే, వారి బ్యాంకు ఖాతాల్లోకే పంపాను. పింఛను కోసం కిలోమీటర్లు నడిచి వందల మీటర్ల క్యూ లో నిలబడే శ్రమ లేకుండా ఇంటికే వచ్చి అదికూడా పొద్దునే తెల్లవారుతూనే, ఒకటవ తారీఖునే అందించా, ఊర్లోనే పనులు అయ్యేలా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు పెట్టా, విద్యా- వైద్యం పై దేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసించని అన్ని విప్లవాత్మక ఆలోచనలు చేశా, బడి బాగు చేశా, ఆస్పత్రి బాగు చేసా, ఫ్యామిలీ డాక్టర్ అని ఇంటికే డాక్టర్ ని పంపి ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్య బాగుకై కృషి చేశా. పోర్టులు కట్టా, మెడికల్ కాలేజీ లు కట్టా.. ప్రతీ పిల్లవాడు బడికి తప్పనిసరిపోయేలా చేశా.. నేను నా ప్రజల కోసం, నా అన్నల, అక్కల, చెల్లెళ్ల, తమ్ముళ్ళు, అవ్వా, తాతల కోసం ఇన్నడుగులు ముందుకేసా, వారు నాకోసం ఒక్క అడుగు ముందుకు వేసి వారే నా క్యాంపెయినర్ లు అవుతారు” అని ప్రజలపై బలమైన నమ్మకాన్ని పెట్టుకున్నాడు..
అయితే ఆయన కాన్ఫిడెన్స్ మీద కన్నుకుట్టుకునే మీడియా, జనాలపై ఆయనకున్న నమ్మకం జనాలు ఆయన్ని నమ్మేలా చేస్తుందని గ్రహించి, లేదు లేదు జగన్ ఓడిపోతాడని ఒప్పుకున్నాడు అంటూ తాత్కాలిక ఆనందం పొందుతుంది.
జగన్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో మరొక్కసారి ఈరోజు జరిగే సభ నిరూపించబోతుందని వైసీపీ వర్గాల అభిప్రాయం.