వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు ముగియనుంది. బస్సు యాత్ర చివర రోజైన ఈరోజు శ్రీకాకుళం జిల్లా అక్కవరం బహిరంగ సభతో ఈ యాత్రకు ముగింపు పలకనున్నారు. బహిరంగ సభ తర్వాత అక్కవరం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి విశాఖ చేరుకొని అక్కడి నుంచి విమానంలో గన్నవరం చేరుకుంటారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి తన నివాసానికి చేరుకుంటారు.
మార్చి 27న వైయస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రను వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ఏప్రిల్ లో జరుగుతాయి అనుకున్న ఎన్నికలు మే నెలలో జరగనుండటంతో ఉన్న సమయంలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను తలపెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మార్చ్ 27 న ఈ యాత్రను ప్రారంభించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖీలు, సభలు, రోడ్ షోలు , ప్రజలకు ఆత్మీయ పలకరింపులతో సీఎం జగన్ బస్సు యాత్ర బాగా సాగిందని చెప్పవచ్చు. మేమంతా సిద్ధం బస్సుయాత్ర మొత్తం 22 రోజులు పాటు 22 జిల్లాలలో కొనసాగగా వాటిలో 15 జిల్లాలలో బహిరంగ సభలో నిర్వహించారు. ఈ బస్సు యాత్రలో మండుటెండను కూడా లెక్కచేయకుండా ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. నేటితో యాత్ర ముగియనుండగా రేపటి నుంచి జగన్ కోసం సిద్ధం ప్రచార కార్యక్రమాలలో సీఎం జగన్ పాల్గొననున్నారు.