కూటమి మేనిఫెస్టో తర్వాత మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో సమావేశం నిర్వహించారు. పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అప్పట్లో ఉమ్మడి మేనిఫెస్టోకి అంగీకారం తెలిపింది. ఆ మేనిఫెస్టోలో చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ, యువతకు జాబులు అంటూ పలు హామీలు ఇచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే మేనిఫెస్టోను తమ అధికారిక వెబ్సైట్లో నుంచి టీడీపీ తొలగించింది. 2014 ఎన్నికల సమయంలో ఆ మేనిఫెస్టోకు తాను హామీ అని చెప్పిన పవన్ కళ్యాణ్, అమలు చేయక పోయేసరికి మీడియా ప్రశ్నించగా వెళ్లి చంద్రబాబుని అడగండి అంటూ చెప్పిన సందర్భం చూశామని పేర్ని నాని మీడియాతో వెల్లడించారు.
మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు మాత్రమే ఉండటం, బీజేపీకి చెందిన వారి ఫొటో లేకపోవడంపై ఆయన స్పందించారు. కూటమి మేనిఫెస్టోలో రెండు ఫొటోలే ఉన్నాయని బీజేపీ సహకారం ఎందుకు లేదని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ప్రజల జీవితాలు మారుస్తామంటూ కబుర్లు చెప్పారని.. కానీ ముగ్గురిలో ఒకరు సంతకం పెట్టే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోతో మోసం చేస్తున్నారని ప్రజలకు తెలిసిపోయిందని, గత మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు అమలు చేస్తానంటున్న పథకాలకు డబ్బులు ఎలా వస్తాయని , సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామంటున్నారని.. ఈ సంపద ఎలా సృష్టిస్తారో చెప్పలేదన్నారు.
2014లానే ఇది కూడా దగా మేనిఫెస్టోగా ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలోని హామీలు నెరవేర్చడం సాధ్యంకాదనే బీజేపీ దీనికి దూరం జరిగిందని, కనీసం ఆ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు హాజరు కాకపోవడం ఎంతవరకు ఆ మేనిఫెస్టోకే విశ్వసనీయత ఉందని ప్రశ్నించారు. ఆ కార్యక్రమానికి అటెండ్ అయిన సిద్ధార్థ సింగ్ ఆ మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. బాబు పవన్ కళ్యాణ్ చెప్పిన మేనిఫెస్టోకి బీజేపీ గ్యారెంటీ లేదని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత చంద్రబాబు అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఇన్సూరెన్స్ లాంటిదే ఈ పొత్తు అని నాని ఎద్దేవా చేశారు.