ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులకన్నా ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ జంక్షన్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కుట్రలు చేస్తున్నారని రాజానగరం సభలో సీఎం జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే…
ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తుంది. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం, ఇబ్బందులు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబునాయుడు ఢిల్లీతో కలిసి ఏ స్ధాయిలో కుట్రలు పన్నుతున్నారో మీరే చూడండి. అవ్వాతాతలకు ఇంటికి వచ్చే పెన్షన్ ను దగ్గరుండి వీళ్లే రాకుండా చేశారు. ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు నేరుగా ఇంటికి పెన్షన్ పంపిస్తున్నాడు. ఎన్నికలకు రెండు నెలలు ముందు చంద్రబాబు కుట్రలు పన్ని.. అవ్వాతాతలకు ఇంటికి పెన్షన్ రాకుండా చేస్తే.. ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్ కు ఓటు వేయరా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే చివరలో బటన్లు నొక్కాడో.. ఆ బటన్లు నొక్కిన సొమ్మును కూడా నా అక్కచెల్లెమ్మలకు రాకుండా ఢిల్లీ వాళ్లలో వీళ్లంతా కుట్రలు చేస్తూ… అడ్డుకునే కార్యక్రమం చేస్తుంటే.. సాక్షాత్తూ మీ జగన్ ఓ ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కేసులు వేసే పరిస్ధితిలోకి ప్రజాస్వామ్యం దిగజారిపోయిందంటే వీళ్లను ఏమనాలి.
ఇవాళ మీ జగన్ బటన్ నొక్కిన పథకాలన్నీ కేవలం ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినవి కాదు. జగన్ నొక్కినవన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జగన్ బటన్ నొక్కుతూ, నొక్కతూ ఉన్న పథకాలకే మల్లీ బటన్ నొక్కాడు. ఈ స్కీమ్ లు కొత్తగా వచ్చినవి కాదు. వీటికి అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినవి. మరి అటువంటివి 60 నెలల కథ దేవుడెరుగు.. .587నెలలు కాకముందు జగన్ ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని.. ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్య పరిస్థిలలోకి వీళ్లు దిగజారిపోయారు.
నేను ప్రతి అక్కచెల్లెమ్మలకు, వారి కుటుంబ సభ్యులకు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు వస్తుందో, మొట్టమొదటిసారిగా మీ జగన్ ఏకంగా ఒక కేలండర్ ఇచ్చి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పాలన జరిగింది కేవలం మీ బిడ్డ హయాంలోనే. మరి ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు కేలండర్ లో చెప్పిన విధంగా క్రమం తప్పకుండా ఇస్తూ పోతున్న మీ జగన్ ను ఇబ్బంది పెట్టడానికి.. చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరు కుంటారా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.
ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు నాయుడికి ఆయన చేస్తున్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని మీబిడ్డగా గట్టిగా కోరుతున్నాను.
మీ బిడ్డగా మాట చెబుతున్నాను.. ఆ దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు. మళ్లీ మీ బిడ్డే అధికారంలోకి వస్తాడు. జూన్ 4 న అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ వారంలో రోజుల్లోనే ఈ బటన్లు అన్నీ క్లియర్ చేస్తాడు. ప్రతి ఒక్కరినీ ఒక్కటే గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను.
కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు మీ జగన్ మాదిరిగా బటన్లు నొక్కలేదు. గతంలో చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మీ జగన్ కన్నా ముందు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ అదే రాష్ట్రం, అదే బడ్జెట్ అయినా ఏ రోజూ చంద్రబాబు ప్రజల కోసం, అక్కచెల్లెమ్మల కోసం బటన్లు నొక్కలేదు. ఏ ఒక్క అక్కచెల్లెమ్మకూ డబ్బులిచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు. ఏ పథకమూ లేదు. కానీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో 130 బటన్లు నొక్కాడు. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపాడు. కాబట్టే మీ జగన్ దగ్గర చంద్రబాబు మాదిరిగా డబ్బులేదు. చంద్రబాబు దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఆ దోచేసిన సొమ్ముతో చంద్రబాబు ప్రజలను పేదలను లోబర్చుకునేందుకు ఎన్నికల రోజు రూ.2, రూ.3 కొన్ని కొన్ని చోట్ల రూ.4, రూ.5 వేలు కూడా ఇస్తాడు. ప్రతి ఒక్కరికీ ఒక్కటే చెబుతున్నాను. చంద్రబాబు ఎన్నికల రోజు ఇచ్చే డబ్బంతా మనదే. మన దగ్గర దోచేసిన డబ్బు. కాబట్టి ఆయన ఇస్తే ఓ ఒక్కరూ వద్దుఅనొద్దు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కటే ఒక్కటి గుర్తుపెట్టుకొండి.
ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. కేవలం క్లాస్ వార్ జరుగుతుంది. పేదవాడు ఒకవైపు పెత్తందార్లు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతుంది. మీరు ఓటే వేసే ముందు మీ ఇంట్లో ఉన్న భార్య, అవ్వాతాతలు, ఆడపడుచులు, పసిపిల్లల అభిప్రాయం కూడా తెలుసుకొండి. ఆ తర్వాత ఎవరి వల్ల, ఏ ప్రభుత్వం. మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగింది.. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మాత్రమే మీరు వేసే ఓటుని డిసైడ్ చేసేటట్టుగా పెట్టుకోమని కోరుతున్నాను. ఈ విషయం చెప్పడం చాలా అవసరమని కచ్చితంగా చెబుతున్నాను.
మీ అందరితో నేను కోరేది ఒక్కటే. జరగబోతున్న కురుక్షేత్రయుద్ధంలో 175 కు 175 అసెంబ్లీ స్ధానాలు, 25 కి 25 ఎంపీ స్ధానాలు గెలవాలి. ఒక్క సీటు కూడా తగ్గేందుకు వీలు లేదు. మన గుర్తు ఫ్యాను. చెల్లి మన గుర్తు ఫ్యాను. మంచి చేసే ఫ్యాను ఇంట్లో ఉండాలి. చెడు చేసే సైకిల్ ఎక్కడ ఉండాలి. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుడాలి. సింక్ లోనే ఉండాలి.ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. మన పార్టీ తరపున బరిలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ చేతులు జోడించి పేరు పేరునా ప్రార్దిస్తున్నానని చెబుతూ సీఎం వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు.