చంద్రబాబు నాయుడి పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నాశనమైంది. కార్పొరేట్‌కు కొమ్ము కాస్తూ ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయలేదు. దీంతో అరకొరగా పిల్లలు ఉండేవారు. ప్రతి సంవత్సరం స్కూళ్ల పునఃప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉండేవి కాదు. పూర్తిగా ఇచ్చిన సందర్భాల్లేవు. అరకొరగా లేటుగా ఇచ్చి బయట దుకాణాల్లో కొనుగోలు చేసుకోండని చెప్పేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రతి ఏడాది బడుల పునఃప్రారంభం రోజు నుంచే విద్యాకానుక కిట్లు అందజేస్తున్నారు. బ్యాగ్, షూలు, పాఠ్య, నోటు పుస్తకాలు, డిక్షనరీ తదితరాలను ఇస్తున్నారు.
ఇంకా వేసవి సెలవులు మొదలు కాలేదు. అప్పుడే స్కూళ్ల పునఃప్రారంభం నాటికి ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్యపుస్తకం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కో జిల్లాలోని గోదాములకు పుస్తకాలు చేరడం మొదలైంది. అక్కడి నుంచి ఎమ్మార్సీలకు తరలిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పట్టణం నుంచి విజయవాడ ఆటోనగర్‌లోని గోదాముకు సోమవారం 2024 – 25 విద్యాసంవత్సరానికి సంబంధించిన 1.20 లక్షల పాఠ్య పుస్తకాలు చేరుకున్నాయి. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు బుక్స్ వచ్చాయి. ఐదేళ్ల నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతోపాటు అన్ని ప్రైవేట్ స్కూళ్లలోని విద్యార్థులకు ప్రభుత్వం సకాలంలో పాఠ్యపుస్తకాలు ఇస్తోందని ఈ సందర్భంగా టెక్ట్స్ బుక్స్ డైరెక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి సోమవారం చెప్పారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని బడులకు సకాలంలో బుక్స్ పుస్తకాలు చేరేలా చర్యలు తీసు కుంటున్నామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాకు 13,94,918, కృష్ణా జిల్లాకు 13,04,663 పుస్తకాలు అవసరమని వివరించారు. మిగిలినవి మే నాటికి వచ్చేస్తాయన్నారు.