2024 సార్వత్రిక ఎన్నికల ముందు టిడిపి తన పార్టీలోని ఆరుగురు నాయకులను సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. సస్పెండ్ చేసిన వారందరూ పార్టీలోని సీనియర్ నాయకులు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అధిష్టానం తమ పేర్లను పరిశీలిస్తుంది అనే నమ్మకంతో దాఖలు చేశారు, కానీ టిడిపి అధిష్టానం నుంచి ఎటువంటి భరోసా రాకపోయేసరికి ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించుకున్నారు. నామినేషన్ల విత్ డ్రాలకు నిన్న చివరి రోజు కాగా స్వతంత్ర అభ్యర్థులుగా వేసిన వారిని టిడిపి బుజ్జగించే ప్రయత్నం చేసింది. టిడిపికి చెందినవారు 8 మంది స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేయగా అందులో ఇద్దరు నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించిన కారణం చేత 6 మంది నాయకుల్ని సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. ఇలా కీలక సమయంలో ఇంతమంది నాయకులు నుంచి వ్యతిరేకత ఎదురుకోవడం టిడిపికి ఊహించని పరిణామంగా చెప్పవచ్చు.
అలా తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారిలో అరకు నియోజవర్గానికి చెందిన సివేరి అబ్రహం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యాం కుమార్, ఉండి నియోజకవర్గానికి చెందిన కలవపూడి శివరామరాజు, పోలవరం నియోజవర్గానికి చెందిన ముడియం సూర్య చంద్రారావు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జిడ్డ రాజశేఖర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చేన్నా యుడు ఒక ప్రకటనలో తెలిపారు.