నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు తమది బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ నాయకులు బీసీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా భారత చైతన్య యువజన పార్టీ శ్రీకాకుళం అభ్యర్థి అయిన బురగాపు చంద్రకళ యాదవ్ నామినేషన్ వేయడానికి వెళ్తుండగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వర్గీయులు అడ్డుకొని దాడులు చేశారు.
వివరాల్లోకి వెళ్తే నిన్న గురువారం రోజున నామినేషన్లకు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులైన టీడీపీ శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థి గోండు శంకర్, బీసీవై పార్టీ ఎంపీ అభ్యర్థి చంద్రకళ యాదవ్ తమ నామినేషన్లకు ఏర్పాట్లు చేసుకొని తమ అనుచరులతో విడివిడిగా ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అయితే ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంటి దగ్గరకు చంద్రకళ యాదవ్ రాగానే టీడీపీ నేతలు మా అభ్యర్ధి నామినేషన్ ర్యాలీ తరువాత మీరు వెళ్ళండి అంటూ చంద్రకళ యాదవ్ ను , ఆమె ర్యాలీ లోని ద్విచక్ర వాహనాలను, ఆటోలను, కార్ లను అపేసి గొడవ చేశారు. ఆపిన వారిని ప్రశ్నించిన చంద్రకళ మీద టీడీపీ శ్రేణులు దాడులకి దిగడంతో భయంతో ఆమె వర్గీయులు చెల్లాచెదురు అయ్యారు.
ఎంపీ రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి శంకర్ వ్యవహార శైలిపై జిల్లాలో మిగిలిన రాజకీయ పార్టీ నేతలు, ముఖ్యంగా బీసీ కుల సంఘాల నాయకులు, యాదవ్ సంఘాల నాయకులు ఒక తోటి బీసీ మహిళ మీద ఎలా దాడులు చేస్తారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. . ఇక్కడ విశేషం ఏమిటంటే చంద్రకళ యాదవ్ కొద్ది రోజుల క్రితమే టీడీపీ నుండి బయటకు వచ్చి బీసీవై పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పటికే రామ్మోహన్ నాయుడు దెబ్బకు శ్రీకాకుళం,పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. ఇప్పుడు బీసీ అందులో తన పార్లమెంట్ పరిధిలో అధికంగా ఉన్న యాదవ్ వర్గ మహిళ మీద దాడి చెయ్యడంతో వారంతా ఇప్పుడు టీడీపీ మీద కోపంతో రగిలిపోతూ దూరం జరుగుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది రానున్న రోజుల్లో టీడీపీకి ఇబ్బందికర పరిస్థుతులును తెస్తుంది అని రాజకీయా పరిశీలకులు భావిస్తున్నారు.