పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించింది.. పనిచేస్తోంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కోసమేనని జగమెరిగిన సత్యం. కానీ జనసైనికుల వద్ద మాత్రం అలా ఏమీ లేదని మనం ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగబోతున్నామని, రాజ్యాధికారం సాధిస్తామని, సీఎం అవుతానని సినిమా డైలాగ్‌లతో కలరింగ్ ఇస్తుంటాడు. వాస్తవం ఏంటంటే తన అభిమానులే ఛీ కొడతారనే భయంతో టీడీపీ నేతల్ని పార్టీలో చేర్చుకున్నానని చెప్పుకోలేని స్థితిలో పవన్ ఉన్నాడు.
2024లో సేనాని రాజకీయాల్లో చక్రం తిప్పేస్తాడని ఆయన అభిమానాలు, నాయకులు, కార్యకర్తలు సంబరపడ్డారు. తీరా చూస్తే టీడీపీకి జై కొట్టాడు. తిట్టుకుని.. బాధపడి చివరికి పోనీలే అని 50 నుంచి 60 సీట్లు తీసుకుంటాడని జనసైనికులు ప్రచారం చేశారు. కానీ 21 దగ్గరే ఆగిపోయాడు. వాటిల్లో పూర్తిగా సేన వారికి అవకాశం కల్పించాడా అంటే లేదు. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ వారికే కండువాలు కప్పి టికెట్లు ఇస్తున్నాడు. కానీ ఈ విషయంపై జనసైనికుల్లో చర్చ జరగకుండా చూసేందుకు మల్లగుల్లాలు పడుతున్నాడు.
సోమవారం తెలుగుదేశం నాయకుడు, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను జనసేనలో చేర్చుకున్నాడు పవన్. బాబు సూచనలతో టికెట్‌ను అతనికే ఇస్తున్నాడు. కానీ ఈ విషయం జనసైనికులకు తెలిస్తే తిట్టుకుంటారని, వారికి అర్థం కాకూడదని సేనాని ప్రయత్నించాడు. పార్టీ అధికారికంగా విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో బుద్ధప్రసాద్‌ను ప్రముఖ రాజకీయ నాయకుడిగా రాశారు. టీడీపీ నాయకుడని రాసేందుకు భయపడ్డారు. అదే విధంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను చూస్తే.. పిఠాపురంలో పవన్ సమక్షంలో ముఖ్య నాయకులు జనసేనలో చేరిక అంటూ ఒకదానిలో రాశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఒకరిద్దిరు చోటా నాయకులను ప్రలోభపెట్టి సేనలో చేర్చుకున్నారు. దీని విషయంలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల చేరికంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకున్నారు.
పవన్ తన జనసైనికులకు ఎంతలా భయపడుతున్నాడో ఇక్కడే అర్థమైపోతోంది. తాను టీడీపీతో అంటకాగుతున్న విషయం వారికి పూర్తిగా తెలిసిపోతే ఓట్ల షేరింగ్ జరగదనే ఆందోళన ఉంది. మొదటి నుంచి సేనాని చంద్రబాబు మనిషేనని, ఆయన చెప్పినట్లే నడుచుకుంటాడని అధికార పార్టీ ఆరోపిస్తోంది. దీనిని నిజం చేసేలాగే సేన అధినేత అడుగులుంటాయి. టీడీపీ నేతల్ని చేర్చుకుని టికెట్లు ఇచ్చే బదులు ఇక పార్టీ ఎందుకని తనను అభిమానులే ఛీ కొడతారని ఆందోళనతో రకరకాల విన్యాసాలు చేస్తుంటాడు. సేనానీ.. కాలం మారిపోయింది. మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ఎవరు ఏ పార్టీ.. ఎవరు పంపితే వస్తున్నారు లాంటి విషయాలు ఇట్టే తెలిసిపోతాయి. దాచాలని ఎంత ప్రయత్నించినా దాగవు.
– వీకే..