తెలుగుదేశం, జనసేన శ్రేణులకు ఓటమి భయం పట్టుకుంది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. రోజూ ఏదో ఒకచోట నేతలపై లేదా వారి ఆస్తులపై రెచ్చిపోతున్నారు. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు తమవారిని రెచ్చగొట్టేలా ప్రసంగిస్తూ ప్రత్యర్థులపై ఉసిగొల్పుతున్నారు.
తాజాగా బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పుట్టావారిపాళెంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు విధ్వంసకాండ సృష్టించారు. ఆ ఊరిలో రెడ్డి వర్గానికి చెందిన వంద కుటుంబాలు వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నాయి. టీడీపీ, జనసేనకు చెందిన రౌడీలు శనివారం అర్ధరాత్రి మద్యం తాగి వారి ఇళ్ల మీదకు గొడ్డళ్లు, ఇనుపరాడ్లు పట్టుకుని వెళ్లారు. 20 మోటార్‌బైక్‌లను ధ్వంసం చేశారు. గ్రామస్తులు గుర్తించి అరవడంతో ఇరు పార్టీల వారు తమ 11 బైక్‌లు వదిలి పరారయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి వాహనాలు, రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. రౌడీమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను వైఎస్సార్సీపీ నాయకులు కోరారు.
అదే జిల్లా చెరుకుపల్లి గోవాడలో మరో ఘటన జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆ ఊరి రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీకి చెందిన 30 ఫ్లెక్సీలను శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బ్లేడుతో కోసేశారు. దీనిపై ఆ పార్టీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పెరుగుతున్న ఆదరణను భరించలేకే ఇలా చేశారని, నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
టీడీపీ, జనసేన కార్యకర్తల అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ప్రజా క్షేత్రంలో వైఎస్సార్సీపీ చాలా బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో తాము గెలిచే పరిస్థితి లేదని తేలిపోవడంతో రెండు పార్టీల నేతలు దాడులకు రూపకల్పన చేశారు. తమవారిని ప్రోత్సహిస్తూ పచ్చని పల్లెల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా చేస్తున్నారు. కూటమి కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీలు రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు పాల్పడే అవకాశముంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైఎస్సార్‌సీపీపైనే నిందలు మోపేందుకు కుట్రలు పన్నుతున్నారు.