‘దుష్టశిక్షణ.. శిష్టరక్షణ కోసం శ్రీరాముడు అంతటి వారే ఆంజనేయస్వామితోపాటు ఉడుత సాయం తీసుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొంది. దుష్టశిక్షణ.. శిష్టరక్షణ జరగాలి. కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటా’ తెలుగుదేశం, జనసేనతో పొత్తు కుదిరిన నేపథ్యంలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్థుల సంగతేంటని విజయవాడలో ఆదివారం మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అది.
ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే లక్ష్యం. అందుకు తగినట్లుగానే వ్యవహరిస్తాయి. దీనికి బీజేపీ ఏమీ అతీతం కాదు. 2014 నుంచి కేంద్రంలో పవర్లో ఉంది. అప్పటి నుంచి చాలా రాష్ట్రాల్లో పాగా వేసింది. దక్షిణాదిలో మాత్రం ప్రభావం చూపించలేక చతికిలపడుతోంది. ఏపీ విషయానికొస్తే ఆ పార్టీ ఎదుగుదల నత్తనడకన సాగుతోంది. ఇందుకు కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని అందరికీ తెలిసిందే.
వాస్తవానికి 2018లో బాబు చేసిన మోసంతో కమలం నాయకులు, కార్యకర్తలు బాగా విసిగిపోయారు. ఆయన అవకాశవాదని ముద్ర వేసేశారు. కానీ 2019లో ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక ముందు జాగ్రత్తగా బాబు తన మనషులను
ఆ పార్టీలోకి పంపారు. పురందేశ్వరిని అధ్యక్షురాలు చేసేలా చక్రం తిప్పారు. ఇది ఇక్కడి సీనియర్ బీజేపీ నేతలకు ఇష్టం లేదు. పార్టీ ఎదిగేందుకు చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతూ వచ్చారు. 2024 ఎన్నికలు సమీపించాయి. చంద్రబాబు వెళ్లి అమిత్‌షా, జేపీ నడ్డాను కలిసినా పొత్తు ప్రకటనపై బాగా ఆలస్యమైంది. దీనికి కారణం చాలామంది నేతలు, కార్యకర్తల వ్యతిరేకతే. వాళ్లు టీడీపీతో కలిసి వెళ్తే నష్టపోతామని చెప్పడంతో దూరం పెడుతూ వచ్చారు.
ఈ నేపథ్యంలో హస్తిన నుంచి వచ్చిన పెద్దలు సమావేశాలు పెట్టి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థుల లిస్ట్‌ను తయారు చేశారు. కొందరు పొత్తును వ్యతిరేకించారని, బాబు మనుషులు మాత్రం కావాలని కోరారని వార్తలు వచ్చాయి. కానీ ఒత్తిళ్లకు తలొగ్గిన కమలం పెద్దలు కూటమికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇది ఏపీలోని మెజార్టీ నేతలు, కార్యకర్తలకు నచ్చడం లేదు. టీడీపీ కోసం పనిచేస్తున్న పురందేశ్వరి ఇప్పుడు వారిని ఒప్పించే పనిలో పడ్డారు. అధిష్టానం మాట వినాలని హితబోధ చేస్తున్నారు. ఆమెకు బాబు ప్రయోజనాలే తప్ప బీజేపీ ఎదుగుదల ఇష్టం లేదనే విమర్శలున్నాయి. రేపు ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జంప్ అయ్యే వారిలో చిన్నమ్మే ముందు ఉంటుందని చెబుతున్నారు.
అసలు ఈ కూటమిలో శ్రీరాముడు ఎవరు.. ఆంజనేయుడు ఎవరు.. ఉడుత ఎవరు.. సమాధానాలు లేని ప్రశ్నలివి. పురందేశ్వరి చాలా తెలివిగా బేతాళ ప్రశ్న వేసి మీరే తేల్చుకోండని వదిలేశారు. చంద్రబాబు, పవన్‌కు శ్రీరాముడు, ఆంజనేయుడి లక్షణాలు ఏ కోశానా లేవు. వారితో పోలిస్తే జనం కొట్టే అవకావాలు లేకపోలేదు. ఒకవేళ ఉడుత అంటే వాళ్లు ఒప్పుకోరు. ఎందుకంటే తాము చాలా బలవంతులమనే భావనలో ఉన్నారు. ఎల్లో మీడియా కూడా అదే డబ్బా కొడుతోంది. దేశాన్ని శాసిస్తున్న బీజేపీని ఏపీలో ఉడుతతో పోల్చి చిన్నచూపు చూస్తే ఆ పార్టీ కార్యకర్తలు అంగీకరించరు. అందువల్ల దీనికి ఆన్సర్ ఉండదు.
ఏతావాతా విషయం ఏంటంటే.. ఇష్టం ఉన్నా.. లేకపోయినా కమలం నేతలు, కార్యకర్తలు పొత్తును ఒప్పుకోవాల్సిందే.. మీరు శ్రీరాముడు, ఆంజనేయుడు, ఉడుత వీటిలో ఏ పాత్ర అయినా పోషించాల్సిందే. చంద్రబాబు చెప్పినట్లు ఇప్పటికైతే నడుచుకోవాల్సిందే అనే ధోరణిలో పురందేశ్వరి ఉన్నారు. ఆమె లెక్క ప్రకారం చూస్తే పొత్తు ప్లాన్ సక్సెస్ అయ్యింది. కానీ మిషన్‌ను విజయంతం చేయాల్సింది నాయకులు, కార్యకర్తలే.. ఇష్టం లేని పెళ్లి లేదా కాపురానికి వాళ్లు సిద్ధంగా లేరు. దీంతో ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి. మళ్లీ విజనరీ నోటి వెంట చారిత్రాత్మక తప్పిదం అనే పదం వినడానికి అందరూ సిద్ధంగా ఉండాలి.