పట్టు వదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానానికి వెళ్ళి భేతాళుని భుజాన వేసుకుని వస్తున్నాడు. యధావిధిగా అతని ఏకాగ్రత భంగం చేయడానికి భేతాళుడు ఏపీ రాజకీయాల కానీ చెప్పడం మొదలుపెట్టాడు.
“విను విక్రమార్కా…. ఏపీ టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా రెడీ, పొత్తులో తొలి లిస్ట్‌లో దాదాపు 90కి పైగా స్థానాలకు అభ్యర్థులు ప్రకటన జరగబోతుందంటూ టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాక, టీడీపీతో పాటే జనసేన సైతం తొలి లిస్ట్‌ను రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందంటూ వాళ్ళే నిర్ణయించేస్తున్నారు.
పొత్తులో భాగంగా తొలి లిస్టు చంద్రబాబు రెడీ చేసినా, దానిని పొత్తు ధర్మం ప్రకారం జనసేనకి చూపించి వాళ్ళు లిస్టు కూడా కలిపి రెడి చేయాలి. కానీ… ఇక్కడా జనసేన లెక్కలు పట్టించుకోకుండా, సంక్రాంతి తర్వాత చంద్రబాబు టీడీపీ జాబితాను రిలీజ్ చేయనున్నారని, అందులో 19 మంది సిట్టింగ్‌లు, మరో 71 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసారని, ఆ లిస్ట్ చూడగానే ప్రత్యర్ధులకి గుండె దడ పట్టుకోనుందని తెలుగు తమ్ముళ్ళు భుజాలు తట్టుకుంటున్నారు. మరి, భుజం కాసిని జనసేన లిస్టుకి పవర్ లేనట్టేనా అంటే వాళ్ళు దగ్గర ప్రస్తుతం సమాధానం లేదు.
అయితే… రాజమండ్రి స్థానానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని స్థానంలో ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు అవకాశం ఉండొచ్చని, జనసేన నుంచి కందుల సురేష్ కోసం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నందున, ఈ సీటు విషయంలో టీడీపీ – జనసేన మధ్య ఫ్రెండ్లీ కంటెస్ట్ జరిగినా ఆశ్చర్యపోవక్కరలేదని ఈ వార్తల సారాంశం. అయితే పొత్తుల విషయంలో టీడీపీ పంథా తెలిసిన వారెవరూ ఆశ్చర్యపోరు. ఏం కంటెస్ట్ ఉన్నా, తమకి కలిసొచ్చే నియోజకవర్గాలని బాబు & కో వదులుకున్న దాఖలాలు లేవు. కావాలంటే, లోపాయికారీగా టీడీపీ రెబెల్స్‌ని ఇండిపెండెంట్ గా అయినా నిలబెట్టే చాణక్యం(?) బాబు సొంతం అని అందరికీ విదితమే.
మరొక ఆసక్తికర అంశం ఏంటంటే విక్రమార్కా…
టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉంటుందట. మరి బీజేపీ వాళ్ళకి ఈ విషయం తెలుసో లేదో?? అసలు టీడీపీకి ఇప్పుడు పొత్తు ఎవరితో అనేదే కోటి రూపాయల ప్రశ్న. టీడీపీ – జనసేనా?? జనసేన – బీజేపీ అసలు ఆంధ్రాలో కలిసి ఉన్నాయా?? ఉంటే, బాబు పవన్‌ని చూస్తున్నట్టు, తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పవన్‌ని చూడగలదా?? పోనీ ఈ మూడూ కలిసి పొత్తు పెట్టుకుంటే, రాళ్ళేయించుకున్న అమిత్‌షా ప్రచారానికి వస్తాడా? వేస్తే టీడీపీ వాళ్ళు మళ్ళీ రాళ్ళేస్తారా, పూలు చల్లుతారా? అసలు టీడీపీతో అంటకాగాలని చూసే సీపీయం వాళ్ళు పరిస్థితి ఏంటి? వాళ్ళతో పొత్తు ఉంటుందా?? చెప్పు విక్రమార్కా… వీటికి సమాధానం తెలిసీ చెప్పలేకపోయావో… నీకు కూడా బెయిలు కోసం లూధ్రాతో వాదించుకోవలసిన కేసు ఏదో ఒకటి మెడకి చుట్టుకుంటుంది, అంటూ భేతాళుడు వాట్సాప్‌లో తిరుగుతున్న టీడీపీ లిస్టువలే తుర్రుమంటూ వెళ్ళి చెట్టు కొమ్మన కూర్చున్నాడు. టీడీపీ విషయంలో ఏ సమాధానం చెప్పాలో తెలియని విక్రమార్కుడు నెత్తి పట్టుకున్నాడు.