ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటిన తరువాత బోడి మల్లన్న అని సామెత . ఇది చంద్రబాబు జీవితం మొత్తానికి సరిగ్గా సరిపోతుంది. ప్రస్థుత పరిస్థితుల్లో ఈ సామెతలో మొదటి భాగాన్ని చంద్రబాబు సరిగ్గా అమలు చేస్తున్నారు. పలు పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్న టీడీపీ పార్టీ.. ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డవారికి మొండిచేయి చూపిస్తూ గెలిచాక ఆదుకుంటామంటూ అభయమిస్తుంది.
వాస్తవాల్లోకి వెళితే.. 2024 ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కునేందుకు టీడీపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని పార్టీలతో పొత్తుపెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.. పొత్తుల్లో భాగంగా ఇప్పటికే జనసేన, బీజేపీలను కలుపుకోని ముందుకుపోతుంది. అయితే 175 నియోజకవర్గాలలో ఏ పార్టీ ఎక్కడ పోటీ చెయ్యాలో, ఏ పార్టీ ఎక్కడ సర్ధుకోవాలో తెలియని తికమకలో పడింది. ముఖ్యంగా టీడీపీలో ఏ నియోజకవర్గంలో ఏ నేత స్థానానికి ఎసర వస్తుందో అర్ధం కాని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయంపై కొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు నాయకులు చంద్రబాబు నాయుడును కలుస్తున్నారు. పొత్తుల కోసం ప్రాణం పెడుతున్న టీడీపీనే తలవంచుకోని మిగతా రెండు పార్టీల ముందు మోకరిల్లింది. ఫలితంగా టీడీపీ పార్టీలోని సీనియర్ నాయకులు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డవారు నష్టపోబోతున్నారు.. సొంత నియోజకవర్గాల్లో వేరే పార్టీల నేతలకు సపోర్ట్ చెయ్యాల్సి రావడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు మాత్రం.. పొత్తులు ఉండటంతో అందరికీ సీట్లు సర్ధలేము.. అధికారంలోకి రాగానే పొత్తులకు సహకరించిన నేతలకు ప్రాధాన్యతను ఇస్తామంటూ ప్రకటించారు.. అంటే పొత్తులకు సహకరించి ఈ ఎన్నికలకు సీట్లు త్యాగం చేసిన వారిని టీడీపీ ఆదుకుంటుందట.. అయితే చంద్రబాబు గతం గురించి తెలిసిన నాయకులు మాత్రం ఆ మాటలన్నీ ఒట్టి మాటలంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.