వాలంటీర్లపై టీడీపీ దుష్ప్రచారం ఆగడం లేదు.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటి గడపకు చేరువ చేసేందుకు సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. కాగా మొదటినుండి వాలంటీర్ వ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన టీడీపీ నాయకులు తాజాగా మరోసారి వారిపై బురదజల్లేందుకు ప్రయత్నించారు. వలంటీర్లను స్లీపర్ సెల్స్ & టెర్రరిస్టులంటూ టీడీపీ నేత బొజ్జల సుధీర్ తీవ్రమైన విమర్శలు చేసారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
వలంటీర్లపై టీడీపీ ఇలా విమర్శలు చేయడం ఇది మొదటిసారేమి కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు వలంటీర్ జాబును మూటలు మోసే ఉద్యోగం అంటూ హేళన చేశారు. ఇళ్లలో మగవాళ్ళు లేనప్పుడు వలంటీర్లు తలుపు తడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసారు. కాగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వలంటీర్ల ఓట్లను కోల్పోయే అవకాశం ఉందనే భయంతో వలంటీర్లను టీడీపీలో కూడా కొనసాగిస్తానంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.
మరోవైపు జనసేన అధినేత వలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసారు. రాష్ట్రంలో ఆడవాళ్లను వలంటీర్లు కిడ్నాప్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ఆడవాళ్లు అదృశ్యం కావడం వెనుక వలంటీర్ల హస్తం ఉందంటూ తనకు సెంట్రల్ ఇంటిలిజెన్స్ వాళ్ళు చెప్పారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తర్వాత కొందరు వలంటీర్ల వల్ల ఆడవాళ్ళ మిస్ అవుతున్నారంటూ పవన్ కళ్యాణ్ మాట మార్చారు.
కాగా ఎప్పటికప్పుడు వాలంటీర్ వ్యవస్థపై విషం కక్కుతూ వస్తున్న టీడీపీ& జనసేన మరోసారి వాలంటీర్ వ్యవస్థపై తమకున్న ఉద్దేశాన్ని బొజ్జల సుధీర్ వ్యాఖ్యల ద్వారా తేల్చిచెప్పినట్లైంది. వలంటీర్లను జిహాదీలతో పోల్చిన టీడీపీ నేత వ్యాఖ్యలను చంద్రబాబు ఖండిస్తారో లేక మౌనంగా ఉండి ఎంకరేజ్ చేస్తారో వేచి చూడాలి. ఒకవేళ శ్రీధర్ వ్యాఖ్యలను ఖండించకుంటే అవి టీడీపీ దగ్గరుండి చేయించిన వ్యాఖ్యలు గానే పరిగణించాల్సి ఉంటుంది.