టీడీపీకి మరో సీనియర్ నేత గుడ్‌బై చెప్పారు. 2024లో ఏపీలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా టీడీపీ జనసేన ఉమ్మడిగా ప్రకటించిన జాబితాలో చోటు దక్కించుకోని సీనియర్లు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జనసేన- టీడీపీల్లో అసంతృప్తులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి గుడ్‌బై చెబుతూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.
గతంలో కాంగ్రెస్ లో కొనసాగిన గొల్లపల్లి సూర్యారావు 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి రాజోలు నుంచి పోటీచేసి విజయం సాధించారు. మళ్లీ 2019లో కూడా రాజోలు నుంచి బరిలోకి దిగిన సూర్యారావు జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. కాగా తాజాగా టీడీపీ జనసేన ఉమ్మడిగా ప్రకటించిన జాబితాలో తనకు టికెట్ దక్కకపోవడం, టికెట్ ఇచ్చే అవకాశం లేదని టీడీపీ అధినాయకత్వం నుండి ఆదేశాలు రావడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. నిరసనలో వ్యక్తం చేయడంలో భాగంగా తన ఇంటి ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు.
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు.. గొల్లపల్లి సూర్యారావు సొంత నియోజకవర్గం. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావును ఓడించారు. 2019లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు గానీ.. జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ చేతిలో మట్టికరిచారు. వచ్చే ఎన్నికల్లో రాజోలు టికెట్.. గొల్లపల్లికి దక్కేలా లేదు. తన కూతురికి టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారాయన. అది కూడా సాధ్యపడకపోవచ్చంటూ టీడీపీ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన నేపథ్యంలో- పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. తన ఇంటి ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించారు.
ఈ నేపథ్యంలో గొల్లపల్లి సూర్యారావు టీడీపీని వీడుతున్నట్లు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ఆయనేం చెప్పారంటే..
1981వ సంవత్సరం నుండి కొత్తపేట సమితి అధ్యక్షునిగా క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించాను. దరిమిలా రెండు దఫాలు స్వర్గీయ ఎన్టీఆర్ మరియు వైయస్ఆర్ మంత్రివర్గాలలో సభ్యునిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించాను. 2014 నుండి 2019 వరకు శాసన సభ్యునిగా మీకు గానీ, పార్టీకి గాని ఏవిధమైన ఇబ్బంది కలిగించకుండా తెలుగుదేశంపార్టీ గౌరవాన్ని నిలిపిన విషయంమీకు తెలుసు. 2019 నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రతికూల పరిస్థితిలో కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిబద్ధతతో, క్రమశిక్షణతో అనుసరించి పార్టీ ప్రతిష్టను నిలబెట్టాను. బాధ్యతా నిర్వహణలో ఏవిధమైన చిన్న పొరపాటు కూడా లేని పరిస్థితిలో మీరు ప్రకటించిన మొదటి 94 యంఎల్ఎ స్థానాలలోనే నన్ను అభ్యర్థిగా ప్రకటించే అర్హతలు ఉన్నప్పటికీ నా పేరును పరిగణలోనికి తీసుకోకపోవడం నాకు అత్యంత బాధ కలిగించింది. నా ఆత్మగౌరవానికి భంగం కలిగిన ఇటువంటి పరిస్థితిలో పార్టీలో కొనసాగలేనని, నేను తెలుగుదేశం పార్టీ పదవులకు మరియు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామాను వెంటనే ఆమోదించవలసినదిగా కోరుచున్నానని లేఖలో గొల్లపల్లి సూర్యారావు కోరారు.
కాగా గొల్లపల్లి సూర్యారావు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే రాజోలు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. రాజోలు సీటు ఆశించి టీడీపీకి దూరమైన గొల్లపల్లి సూర్యారావు వైఎస్సార్సీపీలో చేరనున్న నేపథ్యంలో రాజోలు వైసీపీ అభ్యర్థిగా జగన్ ఎవరి పేరుని ఖరారు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.