పొత్తులో భాగంగా ఏ సీటు ఎవరికి అనేది కేటాయించకముందే టీడీపీ – జనసేన పొత్తులో లుకలుకలు బయటపడుతున్నాయి. “మిమ్మల్ని ఓ మాట అన్నా పట్టించుకోకండి” అని తమ నేత పిలుపునిచ్చినా సరే జనసైనికులు తమ స్వరాన్ని వినిపించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. మరి వీళ్ళ డిమాండుకి చంద్రబాబు వీసమెత్తు విలువైనా ఇస్తారా లేదా అనేది చూడాలి మరి.
వివరాల్లోకి వెళితే, దెందులూరు సీటు చింతమనేని ప్రభాకర్కి ఇస్తే, అతనికి గెలుచుకోగల సత్తా లేదని దెందులూరు జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని వారి పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నారు కూడా. మరి పవన్కళ్యాణ్ వీళ్ళ విన్నపాన్ని వింటారో లేదో అన్నది అనుమానంగానే ఉన్నది.
గతంలో చింతమనేని ప్రభాకర్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతుని ఉద్దేశిస్తూ “సొంత నియోజక వర్గంలో తన అన్ననే గెలిపించుకోలేనివాడు, మమ్మల్ని గెలిపించాడా” అంటూ చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ దులిపేసుకున్నా, జనసైనికులు మాత్రం ఇంకా మరిచిపోయినట్టు లేరు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకునే అతనికి దెందులూరులో మద్దతు ఎందుకివ్వాలి అని ఆలోచిస్తున్నట్టు ఉంది ఈ వ్యవహారం.