ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రమంతటా ఉన్న ఎన్నికల వేడి ఒక ఎత్తు అయితే పిఠాపురంలో ఈ వేడి మరొక ఎత్తుగా మారింది. పిఠాపురం రాజకీయాలు రోజుకు ఒక రీతిన మారుతూ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో గెలుపోటములు దాగుడుమూతలు ఆడుతున్నాయి. ఈ ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వంగా గీత, కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులుగా బరిలో దిగనున్నారు.
అయితే గతంలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా భీమవరం గాజువాక లలో పోటీ చేసి, రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎలా అయినా గెలుపు పొందాలని ఉద్దేశంతో కాపులు ఎక్కువగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు.ఆ క్రమంలోనే కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. కానీ, ఇప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీ నుండి బలమైన నేతగా వర్మ ఉన్నాడు. మొదట్లో సీటు వదులుకోవటానికి కాస్త బెట్టు చేసినా చంద్రబాబు బుజ్జగింపులతో పవన్ కళ్యాణ్ కి ఇవ్వటానికి సముఖత వ్యక్తం చేశాడు. దీనితో పవన్ కళ్యాణ్ గెలుపు సునాయాసంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఏ కార్యక్రమం తలపెట్టినా టిడిపి జనసేన కార్యకర్తల మధ్య రాసభాస తప్పడం లేదు.
నిన్న కూడా వర్మ తన అభిమానులను కార్యకర్తలను పవన్ కళ్యాణ్ కి ఓటు వేయడానికి సర్ది చెప్పే క్రమంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ‘నువ్వు నిలబడితే నీకు వేస్తాం తప్ప పవన్ కళ్యాణ్ కి ససేమిరా ఓట్లు వేయమంటే వెయ్యము’ అని నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన వర్మ మిమ్మల్ని వెయ్యమని నేను బలవంత పెట్టడం లేదు, మీకు ఏమనిపిస్తే అదే చేయండి అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటనతో ఇప్పుడు దాకా వర్మ అండతో సునాయాసంగా సాగిపోతుందనుకున్న పవన్ కళ్యాణ్ గెలుపు ప్రశ్నార్ధకంగా మారింది. ఒకవేళ వర్మ అభిమానులు కార్యకర్తలు ఎదురు తిరిగితే పవన్ కళ్యాణ్ మూడోసారి కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి కనబడుతుంది.