సాధారణంగా రెండు పార్టీలు పొత్తుపెట్టుకుంటే.. ఆయా పార్టీలు ఏయే ప్రాంతాలలో బలంగా ఉన్నాయో చర్చించుకొని ఒక ప్రణాళిక ప్రకారం సీట్లు పంచుకోని ఎన్నికల బరిలో దిగుతుంటారు. అది పొత్తులో ఉన్న పార్టీలు వ్యవహరించే విధానం.. కానీ టీడీపీ జనసేన వ్యవహారం ఇందుకు భిన్నంగా సాగుతుంది.. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్నట్టు ప్రవర్తిస్తుంటే.. పార్టీలోని మిగతా సభ్యులు సీట్ల కోసం కొట్టుకు చస్తున్నారు.
2024 ఎన్నికల సమాయాత్తంలో భాగంగా టీడీపీ పార్టీ రెండు స్థానాల్లో వారి అభ్యర్ధులను ప్రకటించింది. పొత్తులో ఉన్న తమతో సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రకటించడం పై అలిగిన పవన్ కళ్యాణ్ వెంటనే రాజోలు, రాజానగరం స్థానాలకు జనసేన పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. పొత్తులో ఉన్న రెండు పార్టీలు ఏకపక్షంగా వారి అభ్యర్ధులను ప్రకటించడంతో రెండు పార్టీ వర్గాలలో గందరగోళం చెలరేగింది. సీట్ల పంచాయితీ శనివారం మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరింది. కొద్దిసేపటి ఉత్కంఠ తరువాత ఆ రెండు సీట్లను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు టీడీపీ స్పష్టం చేసింది. టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాలలో జనసేనకు సీట్లు కేటాయించడాన్ని వ్యతిరేకించిన పార్టీ అధిష్టాన నిర్ణయంతో అసంతృప్తి వ్యక్తం చేసిన రాజోలు, రాజానగరం టీడీపీ వర్గాలు జనసేనకు మద్ధతిచ్చే ప్రసక్తేలేదని ప్రకటించాయి. అలా టీడీపీ జనసేన పొత్తు వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది.
ఇలా స్పష్టమైన కార్యాచరణ లేకుండా టీడీపీ జనసేన పార్టీలు ముందుకు వెళుతున్నాయి. అసలు పొత్తు పూర్తిగా కొనసాగుతుందా లేక మధ్యలోనే ముగుస్తుందా అన్నది తేలాల్సి ఉంది.