మార్గదర్శి చిట్స్ అక్రమాల వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో మార్గదర్శి కేసులో విచారణను రద్దు చేస్తూ ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టేసింది. అంతే కాదు ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలతో ముడిపడిన ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు రిఫర్ చేసింది. ఆరు నెలల్లో ఈ విచారణ పూర్తి చేయాలని డెడ్ లైన్ కూడా పెట్టింది. దీంతో మార్గదర్శి వ్యవహారంలో ఇక వేగంగా విచారణ సాగనుంది.
మార్గదర్శి అక్రమాలపై నమోదైన కేసును విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్.. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలని అభిప్రాయపడింది. డిపాజిటర్లకు ఇంకా ఎవరికైనా డబ్బులు చెల్లించలేదా అన్నది తేల్చేందుకు మాజీ జడ్డిని నియమించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఆరు నెలల్లోగా ఈ కేసుల విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.
మార్గదర్శి కేసుల విచారణపై స్పందిస్తూ తాము కేసు మెరిట్స్ లోకి వెళ్లబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఆర్బీఐతో పాటు తెలంగాణ హైకోర్టు రెండు, మూడు నెలల్లో డిపాజిట్లపై పరిశీలన జరపాలని సూచించింది. అనంతరం మార్గదర్శలో అక్రమాలపై విచారణ జరిపి ఆరునెలల్లో తీర్పు ప్రకటించాలని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఇంతకు మించి ఈ కేసులో ఎలాంటి వ్యాఖ్యలు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.