వైఎస్ జగన్ ప్రభుత్వం శరవేగంగా బందరు పోర్టు నిర్మాణ పనులను పూర్తి చేస్తుండడంతో బందరు వాసుల చిరకాల వాంఛ నెరవేరనుంది. ఇప్పటికే బందరు పోర్టులో నార్త్బ్రేక్ నిర్మాణం పూర్తిచేయడమే కాకుండా సౌత్బ్రేక్ వాటర్ పనులను కూడా 70 శాతం పూర్తి చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ పోర్ట్ నిర్మణం పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 25000 మందికి ఉపాధి లభించనుంది.
బందరు పోర్టును నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు
బందరు ప్రజల చిరకాల స్వప్నమైన బందరు పోర్టు నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 2008, ఏప్రిల్ 23న శంకుస్థాపన చేశారు. కాగా వైఎస్సార్ మరణానంతరం మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్టు నిర్మాణం మరుగున పడింది. 2014 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టారు. కానీ 2019 ఎన్నికలకు కేవలం నెలన్నర ముందు బందరు పోర్టుకు ఎటువంటి అనుమతులు లేకుండానే మరోసారి శంకుస్థాపన చేశారు.
2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీఎం జగన్ అధికారంలోకి రాగానే పోర్టు నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ‘మచిలీపట్నం పోర్టు డెవలపమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ పేరుతో 2020 ఫిబ్రవరి 4న ప్రత్యేక కంపెనీ ఏర్పాటుచేశారు. అనంతరం పోర్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను పొందిన తరువాత తొలిదశలో రూ.5,254 కోట్లతో పోర్టు నిర్మాణ పనులకు 2023 మే 22న ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. నాటి నుండి శరవేగంగా పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కేవలం 7 నెలల్లో 12 శాతం పనులు పూర్తిచేసి ఏపీ మారిటైమ్ బోర్డు రికార్డు సృష్టించింది. ప్రభుత్వం వేగంగా పనులు చేస్తుండడం వల్ల 2025 కల్లా బందర్ పోర్టు అందుబాటులోకి రానుంది.
బందర్ పోర్ట్ మొత్తంగా 2,075ఎకరాల్లో నాలుగు బెర్తులతో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూ.11,464 కోట్లు ఖర్చుచేయనుండగా తొలిదశలో 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రూ.5,254 కోట్లతో నిర్మించనుంది. పోర్టును జాతీయ రహదారితో అనుసంధానిస్తూ 6.5 కి.మీ మేర నాలుగులైన్ల రహదారి నిర్మాణంతో పాటుగా ఏడు కి.మీ. మేరా రైల్వేలైన్ కూడా నిర్మించనుంది. 2025 సంవత్సరంలో బందరు పోర్టు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభించడంమే కాకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటు మన రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు ప్రయోజనం పొందనున్నారు.