ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ వాదనలు వినిపించిన నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది. తాజాగా ఆమెకు మధ్యంతర బెయిల్‌ను నిరాకరిస్తూ నేటి ఉదయం తీర్పు వెలువరించింది.
కాగా తన కుమారుడికి పరీక్షలున్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేయగా ఆమె కుమారుడికి ఇప్పటికే పరీక్షలు పూర్తయినందున బెయిల్ మంజూరు చేయవద్దని ఈడీ కోర్టును కోరింది. కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బయటకు వస్తే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని ఈడీ వాదనలు వినిపించింది. ఈ క్రమంలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా తీర్పును రిజర్వ్‌లో ఉంచి తీర్పును నేటికి వాయిదా వేశారు. కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుండడంతో ఆమెను మంగళవారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఈ నెల 20న కవిత సాధారణ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని కోర్టు ఇప్పటికే వెల్లడించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని గత నెల 15న హైదరాబాద్‌లో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. కాగా కోర్టు అనుమతితో పది రోజుల పాటు ఆమెను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది. అనంతరం ఆమెను గత నెల 26న తిహాద్ జైలుకు తరలించారు. కుమారుడికి పరీక్షలున్న కారణంగా తనకు మధ్యంతర బెయిల్ ఇప్పించాలని కోర్టును ఆశ్రయించిన కవితకు ఊరట దక్కలేదు.