జనసేన కాపు కులంకు సంబంధించిన పార్టీ కాదని ఇది అందరి పార్టీ అని మొదటినుండి చెప్పుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ బీసీలను అందులోనూ గోదావరి జిల్లాలో మొదటి సీటును శెట్టిబలిజలకే ఇస్తానని ప్రకటించి మోసం చేసాడు. గోదావరి జిల్లాలో కాపులకు,శెట్టిబలిజలకు గొడవలున్నాయని వాటిని అంతం చేయడానికి జనసేన తరపున శెట్టి బలిజ అయిన పితాని బాలకృష్ణకు మొదటి సీటును ఇస్తున్నానని వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ప్రకటించాడు.
తీరా తాను అభ్యర్థులను ప్రకటించిన 18 సీట్లలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను మినహాయిస్తే ఒక్క నరసాపురంలో మాత్రమే బీసీలకు టికెట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మిగిలిన అన్ని సీట్లను కాపులకు ప్రకటించాడు. కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్న ఏకైక కారణంతో పిఠాపురం నుండి స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడం గమనార్హం. గోదావరి జిల్లాల్లో మొదటి సీట్ శెట్టి బలిజలకే ఇస్తా అని ప్రగల్భాలు పలికిన పవన్ చివరకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించాడు.
వారాహి యాత్రలో భాగంగా ముమ్ముడివరం టికెట్ పితాని బాలకృష్ణకు ఇస్తానని ప్రకటించిన పవన్, కాకినాడ సిటీ టికెట్ మాజీ మేయర్ సరోజకు ఇస్తానంటూ ప్రకటించారు. కానీ చివరకు టికెట్ ఇవ్వకుండా మొండిచెయ్యి చూపారు. కనీసం టికెట్ నిరాకరించడానికి గల కారణాలను కూడా ఆయా అభ్యర్థులకు చెప్పకపోవడం గమనార్హం. ఆఖరికి శెట్టి బలిజ నాయకులను కలిసేందుకు కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం లేదనే వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనంగా మారింది. కాపులకు శెట్టి బలిజలకు మధ్య ఉన్న గొడవలను అంతం చేస్తా అంటూ ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలికిన పవన్ కాపులకు మాత్రమే సీట్లు కేటాయించి, శెట్టిబలిజలకు అన్యాయం చేసాడు.
టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా శెట్టిబలిజ నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని వారంతా పవన్ పై మండి పడుతున్నారు. గోదావరి జిల్లాల్లో తాము 15%పైనే ఉన్నామని ఎన్నికల్లో తామేంటో టీడీపీ జనసేనకు చూపిస్తామంటూ శెట్టిబలిజలు భగ్గుమంటున్నారు. టికెట్ ఇస్తామంటూ హామీ ఇచ్చి చివరకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానిస్తారా?. టీడీపీ జనసేన అభ్యర్థులను గోదావరి జిల్లాల్లో ఓడించడానికి కృషి చేస్తామని, మరో రెండు రోజుల్లో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని శెట్టిబలిజ నేతలు ప్రకటించారు. మరి శెట్టిబలిజల హెచ్చరికపై పవన్ కళ్యాణ్ ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి.