తెలుగుదేశం అసలైన యజమాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చనిపోయాక చాలా విషయాలు జరిగాయి. ముఖ్యంగా ఆయన అల్లుడు చంద్రబాబుకు రామారావు అభిమానుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. 1996 జనవరి 18వ తేదీన ఎన్టీఆర్ మరణించారు. దీనికి ముఖ్య కారణం బాబేనని అందరికీ తెలిసిందే. పార్టీని లాక్కొని సీఎం కుర్చీ ఎక్కాడు. తీవ్ర మానసిక క్షోభకు గురైన ఎన్టీఆర్ గుండెపోటుతో మృతిచెందారు. ఆ సమయంలో బాబుకు అనేక షాక్‌లు తగిలాయి. ఈ విషయాలు ఎల్లో పత్రిక ఈనాడులో ప్రచురితమయ్యాయి.
వ్యతిరేకంగా నినాదాలు
ఎన్టీఆర్ మరణ వార్త తెలిసి చంద్రబాబు తన వర్గీయులతో ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో రామారావు అభిమానులు కోపంతో రగిలిపోయారు. బాబుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అన్నకు వెన్నుపోటు పొడిచిన వారందరూ వచ్చారని, వాళ్లంతా నమ్మక ద్రోహులని అరిచారు. బాబు సీఎం అయినా అభిమానులు లెక్క చేయలేదు. అధికారం కోసం చేసిన కుట్రలను ఏకరువు పెట్టారు. ఈ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వెంటనే కొందరు కల్పించుకుని సర్దుబాటు చేయాల్సి వచ్చింది.
హెరిటేజ్ వద్ద బందోబస్తు
ఎన్టీఆర్ మరణించిన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు దీనికి కారణం బాబేనని గళమెత్తారు. చాలాచోట్ల రామారావు చిత్రపటం పెట్టి నివాళులర్పించి బాబు తీరును బహిరంగంగానే ఎండగట్టారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలంలో రెండు హెరిటేజ్ వ్యాన్లను ఆందోళనకారులు కాల్చేశారు. ఈ విషయం చంద్రబాబుకు తెలిసింది. రామారావు అభిమానులే ఇలా చేశారని, ఇంకా చాలా చేస్తారని భావించి వెంటనే పోలీస్ ఉన్నతాధికారులకు తగిన ఆదేశాలిచ్చారు. దీంతో సీఎంకు చెందిన హెరిటేజ్ ప్లాంట్ల వద్ద బందోబస్తు పెట్టారు. బాబు అధికార్ని అడ్డం పెట్టుకుని తన ఆస్తుల్ని కాపాడుకున్నారు.
ఇప్పుడంటే చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ వద్దకెళ్లి పూలమాలలు వేసి భారతరత్న ఇవ్వాలని ఇదో మొక్కుబడిగా చెప్తున్నాడు. అయితే రామారావు మరణానికి ముందు వారిద్దరి మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. ఎన్టీఆర్ అనేక ఇంటర్వ్యూల్లో అల్లుడిని ఏకిపారేశారు. నారా వారు గాడ్సే కన్నా హీనం, నా వెంటే ఉండి వెన్నుపోటు పొడిచాడు, పెద్ద మోసగాడు అన్నారు. జామాత దశమ గ్రహం ఆడియో క్యాసెట్‌ను రిలీజ్ చేశారు. బాబు కూడా చాలా మాట్లాడాడు. ఎన్టీఆర్‌లో నైతిక విలువలు శూన్యమని, అవినీతిపరుడని, మతి భ్రమించిందని చెప్పాడు. మొత్తానికి పిల్లనిచ్చిన మామ మరణం తర్వాత బాబుకు కొన్ని షాక్‌లు తగిలినా.. పీడ విరగడైందని, ఇక తనకు తిరుగులేదని చాలా సంతోషంగా చెప్పేవారని ఆనాటి నాయకులు చెప్పుకొనేవారు.
– వీకే..