ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం నాయకులకు దిక్కు తోచడం లేదు. గెలుపు కోసం అడ్డదారులన్నీ తొక్కుతున్నారు. మొన్నటి వరకు అధినేత చంద్రబాబు నాయుడే వలంటీర్లను తిట్టి తిట్టి.. ఇప్పుడు వారి ఓట్ల కోసం దిగజారిపోయాడు. అండగా ఉంటానని, నెలకు రూ.10 వేలు ఇస్తానని మాయమాటలు చెప్పాడు. మొన్నటి వరకు వ్యతిరేకించిన టీడీపీ నాయకులు నేడు నియోజకవర్గాల్లో వారి చుట్టూ తిరుగుతున్నారు. కానీ సేవా సైన్యం ఇవేమీ నమ్మకుండా తమ పోస్టులకు రాజీనామాలు చేసి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నారు.
టీడీపీ నెల్లూరు సిటీ అభ్యర్థిగా పొంగూరు నారాయణ బరిలో ఉన్నారు. ఈయన నియోజకవర్గ పరిధిలోని కొంత మంది వలంటీర్లను ప్రలోభాలకు గురి చేసి రెండు రోజుల క్రితం టీడీపీ కండువా కప్పాడు. తన విద్యాసంస్థలు, లేదా ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇస్తానని ఆశ చూపాడు. అయితే వలంటీర్లకు మొదటి రోజే అక్కడి పరిస్థితులు అర్థమైపోయాయి. వీరి వెంట నడిస్తే భవిష్యత్ ఉండదని, అవసరం కోసం జాబ్‌లు ఇస్తామని ఆశ పెట్టారని తెలుసుకున్నారు. శనివారం అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డిని కలిసి జగన్‌కు జై కొట్టారు. తమను ఎలా బెదిరించారో వివరించారు.
కొద్దిరోజుల క్రితం టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా తన మనుషుల ద్వారా కోవూరు నియోజకవర్గంలోని వలంటీర్లను కొందరిని ప్రలోభాలకు గురి చేసి, మరికొందరిని భయపెట్టి తెలుగుదేశంలో చేర్పించుకున్నారు. ఇంకా అనేక నియోజకవర్గాల్లో ఇదే తంతు జరుగుతోంది. తమ వెంట నడవకపోతే.. రేపు అధికారంలోకి వచ్చినా.. రాకపోయినా అంతు చూస్తామని తెలుగు తమ్ముళ్లు బెదిరింపులకు దిగుతున్నారు. అయితే వలంటీర్లు మాత్రం తాము వైఎస్సార్సీపీ వెంటే ఉంటే నడుస్తామని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే వేలాది మంది తమ పోస్టులకు రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరారు. పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా ఈసీకి ఫిర్యాదులు చేయించి ఎల్లో గ్యాంగ్‌కు గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు.